Biochar : ఎల్ నినో కు చెక్ పెట్టేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏమిటీ 'బయోచార్'?

Published : Sep 21, 2026, 04:16 PM IST

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుంటారు. తాజాగా ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ఆయన ‘బయోచార్’ అనే కొత్త వ్యవసాయ విధానాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇంతకీ ఏమిటిది?

PREV
15
కుప్పంలో చంద్రబాబు పర్యటన

సొంత నియోజకవర్గం కుప్పంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఆయన పలు పథకాల లబ్ధిదారులు, రైతులు, మహిళలు, యువతతో ముఖాముఖిగా మాట్లాడారు. కుప్పంను మరింత అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం

కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సుమారు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ, ఏఎస్పీ కార్యాలయాల భవనాలకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.3.30 కోట్లతో నిర్మించిన సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, మెటీరియల్ రికవరీ సెంటర్‌ను ప్రారంభించారు.

మల్లనూర్‌లో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.2.70 కోట్లతో చేపట్టనున్న జూనియర్ కాలేజీ నిర్మాణ పనులకు కూడా సీఎం భూమిపూజ చేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.38 కోట్ల విలువైన పలు ప్రభుత్వ పనులకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయ ఫీడర్లకు అవసరమైన విద్యుత్ కోసం 15 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన పీఎం-కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు.

25
ఎల్ నినోను ఎదుర్కొందాం..: చంద్రబాబు

కుప్పం బహిరంగ సభలో రైతులు, గృహిణులు, ఉద్యోగులు, యువత, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో చంద్రబాబు నేరుగా మాట్లాడారు. హంద్రీనీవా కాలువ ద్వారా నీరు అందుతున్న తీరుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. కుప్పం ప్రాంతానికి హంద్రీనీవా ద్వారా నీటిని తీసుకురావడం, చెరువులను నింపడం వల్ల వ్యవసాయానికి ప్రయోజనం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు.

వ్యవసాయంలో అధికంగా రసాయన ఎరువులు వినియోగించకుండా ప్రకృతి, సేంద్రియ విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. వాతావరణ మార్పుల ప్రభావంతో ఎల్‌నినో తరహా పరిస్థితులు ఏర్పడుతున్నాయని, వర్షాభావం కారణంగా కృష్ణా, గోదావరి నదుల్లో నీటి లభ్యతపై ప్రభావం పడుతోందని చంద్రబాబు చెప్పారు. భూమిలో తేమ, సారం పెంచేందుకు బయోచార్ వంటి విధానాలను ఉపయోగించాలని సూచించారు.

ఏమిటీ బయోచార్?

చంద్రబాబు పేర్కొన్న బయోచార్ అనేది ఓ రకమైన ఆధునిక వ్యవసాయ పద్దతి. ఇందులో పంట వ్యర్థాలు అంటే ఆకులు, వరిపొట్టు, చెక్కముక్కలు వంటి బయోమాస్ ను 400 నుండి 700 డిగ్రీ సెల్సియస్ వద్ద మంట లేకుండానే కాలుస్తారు. దీంతో అందులోకి కార్బన్ స్థిరపడి నల్లటి, తేలికపాటి రంధ్రాల నిర్మాణంగల బయోచార్ ఏర్పడుతుంది. దీనికి నేలలోని నీటిని, పోషకాలను నిలుపుకునే శక్తి ఉంటుంది... అంటే వ్యవసాయంలో దీన్ని ఉపయోగించడమే బయోచార్. ఈ పద్దతిలో వ్యవసాయం ద్వారా నీటి వినియోగం తగ్గుతుంది… పంట దిగుబడి పెరుగుతుంది.

ప్రకృతి సేద్యంపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా భూములను ఖాళీగా ఉంచకుండా పచ్చదనాన్ని పెంచాలని సూచించారు.

ప్రస్తుత కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తామని సీఎం తెలిపారు. వ్యవసాయంలో నీటి పొదుపు, నేల ఆరోగ్యం, ప్రత్యామ్నాయ పంటలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

35
ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్తే లక్ష్యం : చంద్రబాబు

పీ4 కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్న లక్ష్మి అనే మహిళతో చంద్రబాబు మాట్లాడారు. ఇటుకల బట్టీ ఏర్పాటుకు ఈ కార్యక్రమం ద్వారా సహకారం అందడంతో తాను మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగానని ఆమె సీఎంకు వివరించారు.

ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. టీవీఎస్, అదానీ, మెగా వంటి సంస్థలు పీ4 కార్యక్రమంలో భాగంగా వేలాది కుటుంబాలకు సహకారం అందిస్తున్నాయని తెలిపారు.

కుప్పంలోని ఒక కంపెనీలో ఉద్యోగం పొందిన సురేఖ అనే యువతిని కూడా సీఎం అభినందించారు. స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రతి కుటుంబంలోనూ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

‘నెట్ జీరో కుప్పం’

కుప్పంను పర్యావరణహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నామని చంద్రబాబు తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడా చెత్త కనిపించకుండా నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

కుప్పంలో 82 ప్రాసెసింగ్ కేంద్రాల ద్వారా వ్యర్థాల నుంచి కాంపోస్టు తయారీకి చర్యలు చేపడుతున్నామని సీఎం వెల్లడించారు. భవిష్యత్తులో కుప్పంను నెట్ జీరో నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా నెట్ జీరో విధానంలోకి రావాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసి ఇళ్లనే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చాలన్నది తమ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు.

ఆరోగ్య సేవల్లో సంజీవని ప్రాజెక్ట్

కుప్పంలో ఆరోగ్య సేవలపై కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారు. సంజీవని ప్రాజెక్టులో భాగంగా ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తున్నామని చెప్పారు. కుప్పంలో ఇప్పటికే వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి డిజిటల్ హెల్త్ రికార్డులను రూపొందిస్తున్నామని, వాటి ఆధారంగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 13 పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల ద్వారా సుమారు 1.29 లక్షల మందికి ఆరోగ్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.

45
పేదలకు ఇళ్లు, భూమి హక్కులు

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమం ద్వారా ఇల్లు, ఇంటి స్థలాన్ని అందించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కంగుండిలో చాలా కాలంగా పరిష్కారం కాని భూ సమస్యను పరిష్కరించి 320 మందికి పట్టాలు అందించామని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ భూ సమస్యలను పరిష్కరించి ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం ద్వారా పట్టాలు అందిస్తున్నామని వివరించారు.

కుప్పం అభివృద్ధిపై స్థానికుల స్పందన

కుప్పంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల తమకు కలిగిన ప్రయోజనాలను పలువురు స్థానికులు సీఎం చంద్రబాబుకు వివరించారు. కుప్పం మెడికల్ కాలేజీ తన తండ్రి ప్రాణాలను కాపాడిందని యువ పారిశ్రామికవేత్త సుబ్రహ్మణ్యం తెలిపారు.

కుప్పంలో తయారవుతున్న ఆర్గానిక్ ఉత్పత్తులను ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయిస్తున్నామని మరో యువకుడు వివరించారు. హంద్రీనీవా సుజల స్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా నీటి ప్రవాహానికి సంబంధించిన వీడియోను సభలో ప్రదర్శించారు. కుప్పం అభివృద్ధిపై నిర్వహించిన వీడియో కాంటెస్టులో విజేతలుగా నిలిచిన సుబ్రహ్మణ్యం, విక్కీలను సీఎం చంద్రబాబు సత్కరించారు.

55
డీఎస్సీ టీచర్ల అంశంపై చంద్రబాబు వ్యాఖ్యలు

కుప్పం బహిరంగ సభలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల అంశంపైనా చంద్రబాబు స్పందించారు. ఉపాధ్యాయులపై వైసిపి దాడులు చేయడం సరికాదని అన్నారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని చేస్తున్న ఆరోపణలను చంద్రబాబు ఖండించారు. తన ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్లలో అవినీతికి అవకాశం ఉండదని, నియామకాలు పూర్తయిన తర్వాత కూడా రాజకీయంగా విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

వైసిపిపై తీవ్ర విమర్శలు

కుప్పం సభలో చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 2019–24 మధ్య రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆరోపించారు. తన కుప్పం పర్యటనల సమయంలోనూ గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు.

అమరావతి, డీఎస్సీ నియామకాలు, మందు బ్రాండ్లు, ఏపీపీఎస్సీ వ్యవహారాలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీపై విమర్శలు చేశారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ దాడులకు పాల్పడటం సరికాదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితికి తావు ఉండకూడదని సీఎం అన్నారు.

‘పేదరికం లేని కుప్పం’గా మార్చడమే లక్ష్యం

కుప్పంను పేదరికం లేని నియోజకవర్గంగా మార్చడమే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. పీ4 కార్యక్రమం ద్వారా 8,904 ‘బంగారు కుటుంబాలను’ గుర్తించి సహాయం అందిస్తున్నామని చెప్పారు. కుప్పాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ‘స్వర్ణ కుప్పం’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. నీరు, ఆరోగ్యం, విద్య, పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయం, పర్యావరణం వంటి రంగాల్లో సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కుప్పం తన రాజకీయ జీవితంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు కుప్పం నుంచే నాంది పలుకుతామని, నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories