YSR Congress Party
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మూడు అరెస్టులు, ఆరు కేసులు అన్న చందంగా రచ్చరచ్చ అవుతోంది. గత ప్రభుత్వంలో సోషల్ మీడియాని బూతులు, అశ్లీల పోస్టులతో నింపేసిన బ్లూ బ్యాచ్‌కి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఆడపిల్లలు, మహిళలపై విచక్షణ లేకుండా చేసిన ట్రోలింగులు, మార్ఫింగులకు ప్రభుత్వం బదులిస్తోంది. దీంతో ఏ పోస్టు పెట్టిన వాళ్లని ఎప్పుడు పోలీసులు పట్టుకెళ్తారో తెలియక వైసీపీ లబోదిబోమంటోంది.
chandrababu pawan
2024 అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ఘన విజయం సాధించింది. 2019లో 151 సీట్లు గెలుచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. 2024కి వచ్చే సరికి చతికిలపడింది. ప్రజా వ్యతిరేకతతో అధః పాతాళానికి పడిపోయి 11 సీట్లకు పడిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి నెలకొంది.
ఎన్నడూ లేనివిధంగా ప్రభంజనం సృష్టించిన ఎన్డీయే కూటమి అధికారం చేపట్టి... ఆంధ్రప్రదేశ్‌లో తనదైన పంథాలో పాలన సాగిస్తోంది. అటు, గత ఐదేళ్లలో వైసీపీ చేసిన తప్పులను చీల్చి చెండాడుతూ... చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను తూలనాడిన జగన్ గ్రూప్‌ని ఓ ఆటాడుకుంటోంది.
వైసీపీ పాలనలో టీడీపీ, జనసేన నేతలపై సోషల్ మీడియాలో రెచ్చిపోయిన జగన్ సోషల్ మీడియా గ్యాంగ్‌కి చుక్కలు చూపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. సీఎం చంద్రబాబు చర్యలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం తోడు కావడంతో వైసీపీ సోషల్ మీడియా గ్యాంగ్‌కి, ఆ పార్టీ నేతలకు నిద్ర పట్టడం లేదు. ఎప్పుడు అరెస్టులు చేస్తారో...? ఏయే స్టేషన్ల చుట్టూ తిప్పుతారోనని కలవరిస్తూ.. కునుకు లేకుండా గడుపుతున్నారు. మరోవైపు ప్రభుత్వంపై ఎదురు దాడి కూడా చేస్తున్నారు. ఏ పాపం తెలియని తమ సోషల్ మీడియా యాక్టివిస్టులను చంద్రబాబు ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసి.. అక్రమ కేసులతో వేధిస్తోందని వాదిస్తోందని వైసీపీ నేతాగణం.
YS Jagan
ఈ మంట కొనసాగుతుండగానే... ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే గతాన్ని తవ్వి అరెస్టులు, కేసులతో వాతలు పెడుతున్న చంద్రబాబు....... అసెంబ్లీకి వెళ్తే ఏ రేంజ్‌లో ఆడుకుంటారోనని జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకొని.. ఆ పని చేసేశారు.
అయితే, ఇక్కడే ఇరుక్కుపోయారు పాపం. పోనీలే పాపం అని.. అసెంబ్లీకి రాని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వదిలేసినా... షర్మిల మాత్రం వదలడం లేదు. జనం ఓట్లేస్తే.. తిని ఇంట్లో కూర్చుంటారా..? అంటూ గట్టిగానే నిలదీస్తోంది. ఏ ప్రెస్ మీట్ పెట్టినా, నిరసన కార్యక్రమాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ... జగన్‌ని, వైసీపీని వాయించి పడేస్తోంది. తాజాగా పెట్టిన ప్రెస్‌మీట్‌లోనూ జగన్‌ని ఏమాత్రం వదిలిపెట్టలేదు.
YS Sharmila
''జగనన్నా.. జనం ఓట్లేసి గెలిపిస్తే.. మీకిది భావ్యమేనా..?'' అంటూ నిలదీసింది షర్మిల. ''మిమ్మల్ని గెలిపించింది ప్రజలు. మీకు భాధ్యత లేదా..? ప్రతిపక్ష హోదా లేకపోతే మైకూ ఇవ్వరని చెబుతున్నారు. మైకు ఇవ్వకపోవడం మీ స్వయంకృత అపరాధం. ఒకప్పుడు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు.. 11 సీట్లు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు..? మీ అక్రమాలను, అవినీతిని ప్రజలు గమనించారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారు. మీకు ప్రజల తీర్పు మీద గౌరవం ఉండాలి కదా. 'అసెంబ్లీకి పోను..' అనడం మీ అహకారం, అజ్ఞానానికి నిదర్శనం. దీనిపై జగన్ సమాధానం చెప్పాలి.
అలాగే వైసీపీ ఎమ్మెల్యేలను అడుగుతున్నాం. మీకు ప్రజలు ఓట్లు వేశారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ అసెంబ్లీ. మీకు ఆలోచన లేదా..? ప్రజలు మీకు ఓట్లు వేసింది అసెంబ్లీ వెళ్ళడానికి కదా. అసెంబ్లీకి పోకుంటే మీరు ప్రజలను వెన్నుపోటు పొడిచినట్లు కాదా..? ప్రజలను మోసం చేసినట్లు కాదా..? జగన్‌కి అంటే అహంకారం ఉంది. మీకు ఏమయ్యింది. ఇంట్లో కూర్చొని మాట్లాడటానికి కాదు కదా ప్రజలు మీకు ఓట్లు వేసింది..? మీ అజ్ఞానం ఏంటో బయటపడింది. వైసీపీ ఎమ్మెల్యేలకు ఇది భావ్యం కాదు. బడ్జెట్ ప్రవేశపెడుతుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఎవరు..? ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేది ఎవరు..? సర్కార్ దందాలను ప్రశ్నించేది ఎవరు..? ఎన్నికల్లో నిలబడ్డప్పుడు అసెంబ్లీకి పోను అని మీరు చెప్పారా..? మీకు దైర్యం, సామర్థ్యం లేకుంటే రాజీనామా చేయండి.'' అంటూ జగనన్న విడిచిన బాణం ఆ జగనన్నపైనే లేఖాస్త్రం సంధించింది.
మీరు అసెంబ్లీకి వెళ్ళకుంటే రాజీనామాలు చేయండి. లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలను లేవనెత్తండి అంటూ తన పార్టీ కాంగ్రెస్ తరపున డిమాండ్ చేసేసింది....అయితే జగన్ ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత.. అది మారదు. అంటే షర్మిల ఎన్ని లేఖాస్త్రాలు సంధించినా.. జగన్ మాత్రం అసెంబ్లీలో అడుగుపెట్టడు కాక పెట్టడు. అంటే.. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలే అధికార, ప్రతిపక్షాలన్న మాట.