AP DSC Recruitment : ఆంధ్ర ప్రదేశ్ యువతకు స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపికబురు చెప్పారు. నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసారు. మరో మూడు నెలల్లోనే ఏకంగా 16 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని... ఇప్పటికే ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి మెగా డిఎస్సి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాలకు సన్నద్దమయ్యే యువతీయువకులు కూటమికి మద్దతుగా నిలిచారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేనాటికి భారీగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇప్పటికే పలుమార్లు విద్యాశాఖమంత్రి నారా లోకేష్ తెలిపారు.
అయితే తాజాగా సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మెగా డిఎస్సిపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత విద్యాసంవత్సరం మరో నెలరోజుల్లో పూర్తవుతుంది... ఆ తర్వాత స్కూళ్లకు వేసవి సెలవులు ఉంటాయి. ఈ సెలవులు ముగిసి తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికి ఉపాధ్యాయ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఇలా ఏ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులకు ఇప్పటికే నాణ్యమైన భోజనం పెడుతున్నాం... వచ్చే విద్యాసంవత్సరం నుండి నాణ్యమైన చదువు కూడా అందిస్తామన్నారు. అందుకోసం బాగా చదువుకున్న యువతను డిఎస్సి ద్వారా టీచర్లుగా నియమిస్తున్నామని... ఈ నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుందని చంద్రబాబు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనను బట్టి చూస్తే వచ్చే అతి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి టీచర్ ఉద్యోగాల కోసం సన్నద్దమయ్యే యువత ఇప్పుడే అలర్ట్ కావాలి... ప్రిపరేషన్ ను మరింత సీరియస్ గా తీసుకోవాలి. భారీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు కాబట్టి పోటీ కూడా అదేస్థాయిలో ఉంటుంది... ఇప్పటినుండే బాగా ప్రిపేర్ అయితేనే కలలుగనే జాబ్ ను సాధించగలరు.