
Per Capita Income : ఏ దేశం, ఏ రాష్ట్రం అభివృద్ది అయినా అక్కడి ప్రజల ఆదాయాన్ని బట్టి నిర్దారించవచ్చు. తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే అది అభివృద్దికి, ప్రజల మెరుగైన జీవన విధానానికి ప్రతీక... తక్కువగా ఉంటే వెనకబడిన ప్రాంతంగా భావిస్తారు. అందువల్లే భారతదేశంలోని ప్రతి రాష్ట్రం తలసరి ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి... తెలుగు రాష్ట్రాలు కూడా పోటీపడి మరి తలసరి ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి.ఉభయ సభలను (శాసనసభ, మండలి) ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ది, ప్రజా సంక్షేమం ఎలా సాగుతుందో వివరించారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రజల ఆదాయం పెరిగిందని... గత ప్రభుత్వ పాలనలో కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువయ్యిందని గవర్నర్ నజీర్ తెలిపారు.
గవర్నర్ ప్రసంగంపై ఏపీ తలసరి ఆదాయం తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలయ్యింది. నిజంగానే చంద్రబాబు సర్కార్ హయాంలో ఏపీ ప్రజల ఆదాయం పెరిగిందా? ఎంత పెరిగింది? తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ప్రజల ఆదాయం ఎక్కువ? అనేది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి వీటిగురించి తెలుసుకుందాం.
ఏపీ కంటే తెలంగాణోళ్లే బాగా రిచ్...
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు ప్రజలందరి తలసరి ఆదాయం ఒక్కటే. కానీ 2014లో రెండు రాష్ట్రాలు విడిపోవడంతో తలసరి ఆదాయాలు కూడా మారిపోయాయి. భారీ ఆదాయం కలిగిన హైదరాబాద్ నగరం తెలంగాణకు దక్కడంతో ఇక్కడి ప్రజల తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది... ఇదే సమయంలో భారీ ఆదాయాన్ని కోల్పోయిన ఏపీ ప్రజలు తలసరి ఆదాయం తగ్గిపోయింది.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ తలసరి ఆదాయం రూ.2.68 లక్షలుగా ఉంది. అంటే రాష్ట్రంలోని ఓ వ్యక్తి సగటున ఇంత ఆదాయాన్ని కలిగివున్నాడన్నమాట. ఇదే సమయంలో తెలంగాణ తలసరి ఆదాయ రూ.3.56 లక్షలుగా ఉంది. అంటే ఏపి ప్రజల కంటే తెలంగాణోళ్లే బాగా రిచ్ అన్నమాట. ఆసక్తికర విషయం ఏమిటంటే హైదరాబాద్ కంటే శివారు జిల్లా రంగారెడ్డి తలసరి ఆదాయమే ఎక్కువగా ఉంది. ఆ జిల్లా ప్రజల్లో ఒక్కొక్కరి సగటు ఆదాయం రూ.9.54 లక్షలుగా ఉంది.
ఇలా తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే టాప్ లో నిలిచింది. కానీ ఏపీ మాత్రం ఆదాయంలో వెనకబడింది. గత ప్రభుత్వ విధ్వంస పాలన కారణంగానే ఏపీకి పెట్టుబడులు రాలేవని... అందువల్లే రాష్ట్ర ఆదాయం పెరగలేదని టిడిపి నాయకులు అంటున్నారు. ప్రస్తుత కూటమి పాలనలో మళ్ళీ రాష్ట్రం గాడిలో పడుతోందని ... తలసరి ఆదాయం పెరుగుతోందని అంటున్నారు. 2047 నాటికి రూ.58.14 లక్షల తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఏపిని తీర్చిదిద్దే విజన్ తో ముందుకు వెళుతున్నామని ఇటీవల సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు.
రాష్ట్రాలవారిగా తలసరి ఆదాయాలు :
దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. ఆ రాష్ట్రంలో ఒక్కరి ఆదాయం సగటున రూ.5.49 లక్షలుగా ఉంది. ఆ తర్వాత గోవా రూ.5.02, డిల్లీ రూ.4.44, చండీఘర్ రూ.4.06 లక్షల తలసరి ఆదాయం కలిగి ఉన్నాయి. ఇలా చిన్నరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కాకుండా పెద్దరాష్ట్రాల తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ లో ఉంది... ఈ రాష్ట్రంతో పాటు కర్ణాటక , హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు కూడా రూ.3 లక్షలకు పైగా తలసరి ఆదాయం కలిగిఉన్నాయి.
కేరళ రూ.2.69, మహారాష్ట్ర రూ.2.42, గుజరాత్ రూ.2.85, పాండిచ్చెరి రూ.2.16, ఉత్తరాఖండ్ రూ.2.34, అండమాన్ & నికోబార్ దీవులు రూ.2.32 లక్షల తలసరి ఆదాయం కలిగిఉన్నాయి.
తలసరి ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ దేశంలో 15వ స్థానంలో నిలిచింది. ఇక హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, త్రిపుర, రాజస్థాన్, ఒడిషా,పశ్చిమ బెంగాల్, చత్తీస్ ఘడ్, నాగాలాండ్, మధ్యప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, మేఘాలయా, అస్సాం, మణిపూర్ తలసరి ఆదాయం కూడా తక్కువగా ఉంది. జార్ఖండ్ రూ.84 వేలు, ఉత్తర ప్రదేశ్ రూ.79 వేలు, బిహార్ రూ.59 వేలతో చివరి స్థానంలో నిలిచాయి.