మొబైల్ ను ఎన్ని గంటలు వాడుతున్నామో తెలుసా?

By telugu team  |  First Published Jan 1, 2020, 12:49 PM IST

నిత్యం మనం స్మార్ట్ ఫోన్ ను ఎన్నిసార్లు వాడుతున్నామో తెలిస్తే గుడ్లు తేలేయక తప్పదు. నిరంతరం సెల్ ఫోన్ వాడడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతున్నట్లు సర్వేలో తేలింది.


న్యూఢిల్లీ: భారతీయులు సగటున ఏడాదిలో 1800 గంటలు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. గ్లోబల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వీవో సైబర్ మీడియా రీసెర్చ్ (సిఎంఆర్)తో కలిసి చేసిన పరిశోధనలో ఆ విషయం తేలింది. దేశంలోని సగం మందికి మొబైల్ వ్యసనంగా మారిందని, అది లేకపోతే బతకలేమనే స్థితికి చేరుకున్నారని పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

స్మార్ట్ ఫోన్, మానవ సంబంధాలపై దాని ప్రభావం అనే శీర్షికన జరిగిన ఆ  పరిశోధన ప్రకారం... 73 శాతం మంది శారీరక, మానసిక ఆరోగ్యంపై స్మార్ట్ ఫోన్ ప్రభావం చూపింది. స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రతి నలుగురిలో ఒకరు శారీరక సమస్యలపై మాట్లాడుతున్నారు. వీరిలో చాలా మందిలో చూపు మందగించడం, కళ్లలో నీరు కారడం, తలనొప్పి, ఇన్సోమ్నయా వంటి సమస్యలను ఎదుర్కుంటున్నారు.

Latest Videos

పడుకోవడానికి ముందు చివరగా చూసేది ఫోన్ అని ప్రతి ఐదుగురిలో నలుగురు చెప్పారు. ఉదయం లేచిన తర్వాత కూడా మొదట చూసేది ఫోన్ నే. లేచిన అరగంటలోపల తొలుత తాము మొబైల్ నే చూస్తున్నామని 74 శాతం మంది చెప్పారు. 

కొంత సమయం పాటు ఫోన్ ను స్విచాఫ్ చేస్తే ఆరోగ్యం బాగుంటుందని చాలా మంది గుర్తించారు ఫోన్ చెక్ చేసుకోకుండా తెరిపి లేకుండా కనీసం 5 నిమిషాల పాటు తాము కుటుంబ సభ్యులతో మాట్లాడలేకపోతున్నట్లు ప్రతి ముగ్గురిలో ఒకరు చెప్పారు. 

ఆనందంగా జీవించాలంటే ఫోన్ ను తక్కువగా వాడడం మంచిదని ప్రతి ఐదుగురులో ముగ్గురు అంగీకరించారు. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఆన్ లైన్ వేదికల ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుని దాన్ని విశ్లేషించారు. దాంతో పాటు 64 శాతం మంది పురుషులను, 36 శాతం మంది మహిళలను ఇంటర్వ్యూ చేశారు. 

click me!