చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘షియోమీ’ కి దీటుగా ఎదిగేందుకు దక్షిణ కొరియా మేజర్ శామ్‌సంగ్ సిద్ధం అవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ సిరీస్ ఫోన్లు 40 రోజుల్లోనే 20 లక్షలు అమ్ముడు పోయి కొత్త రికార్డు నెలకొల్పాయని శామ్ సంగ్ ప్రకటించింది.
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేజర్ శామ్‌సంగ్.. తన ‘ఏ సిరీస్’స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో రికార్డు సృష్టించినట్లు సోమవారం తెలిపింది. కేవలం 40 రోజుల్లో ఏకంగా 20 లక్షల యూనిట్ల విక్రయించామన్నది... వీటి విలువ దాదాపు రూ.3,500 (50 కోట్ల డాలర్లు) కోట్లని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రంజివిజిత్ సింగ్ తెలిపారు.
స్మాల్ సిటీస్, మెట్రోల్లో ఏ సిరీస్ ఫోన్లకు అనూహ్య స్పందన
చిన్న నగరాలు, మెట్రోల నుంచి ఏ50, ఏ30, ఏ10 స్మార్ట్‌ఫోన్లకు అనూహ్య స్పందన లభిస్తుందని చెప్పారయన. కంపెనీ నిర్థేశించుకున్న 4 బిలియన్ల (రూ.28 వేల కోట్ల) ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. వచ్చే కొద్ది వారాల్లోనే గెలాక్సీ ఏ80, ఏ70, ఏ2 కోర్ ఫోన్లు విడుదల కానున్నాయని చెప్పారు.
షియోమీ దూకుడుతో వ్యూహాన్ని మార్చుకున్న శామ్ సంగ్
ఎ2 కోర్ ఫోన్ ధర రూ.5,200లకు అందుబాటులో ఉంటుందని, ఏ 80 ఫోన్ గ్రేట్ ఇన్నోవేటివ్ ఫీచర్లు కలిగి ఉంటుందని శామ్ సంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రంజివిజిత్ సింగ్ పేర్కొన్నారు. ఈ శ్రేణిలో శక్తిమంతమైన గ్రోథ్ ఉంటుందని అంచనా వేశారు. చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలు మార్కెట్లో ఆదిపత్యం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో శామ్ సంగ్ తన వ్యూహాన్ని మార్చుకున్నది.
మిడ్ రేంజ్ ఫోన్లనూ అందుబాటులోకి తేనున్న శామ్ సంగ్
టాప్ ఎండ్ ఇన్నోవేటివ్ ఫీచర్లతో మిడ్ రేంజ్ ఫోన్లనూ వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని శామ్‌సంగ్ నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏ10, ఎ20, ఎ30, ఎ50 మోడల్ శామ్‌సంగ్ ఫోన్లు రూ.8,490 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
ఉద్యోగుల వలసల నివారణకు ఇన్ఫోసిస్ కొత్త వ్యూహాలు
అమెరికా అవకాశాలు తగ్గి, అట్రిషన్ రేటు పెరిగిపోతుండటంతో ఉద్యోగుల వలసలను తగ్గించేందుకు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్ విభాగంలో నైపుణ్యాలున్న ఉద్యోగులకు ప్రోత్సాహకాలిచ్చేలా ప్రత్యేక పథకాల్లాంటివి కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
గత త్రైమాసికంలో 0.5 శాతం పెరిగిన వలసలు
గతేడాది ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశంలో ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు ఈ విషయాలు చెప్పారు. మార్చి త్రైమాసికంలో ఉద్యోగుల వలస 17.8 శాతం నుంచి 18.3 శాతానికి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 3–5 ఏళ్ల అనుభవం ఉన్న వారు, ప్రధానంగా అమెరికాలో ఆన్‌సైట్ అవకాశాల కోసమే ఆగిన వారు ఇందులో ఎక్కువగా ఉన్నారని చెప్పారు.
కఠిన వీసా నిబంధనలతోనే ఇతర సంస్థల వైపు నిపుణులు
కఠినతర వీసా నిబంధనల కారణంగా అమెరికా అవకాశాలు తగ్గిపోవడంతో వారు ఇతర సంస్థల వైపు మళ్లారని ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావు చెప్పారు. మరోవైపు, అమెరికాలో ఎక్కువగా స్థానికులను ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని, దీనివల్ల వీసాలపరమైన సమస్యలు కొంత అధిగ మించగలుగుతున్నామని ఆయన వివరించారు.