చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్ మీ’ స్మార్ట్‌ఫోన్ల విపణిలోకి మరో రెండు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. ఆన్‌లైన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నార్జో10ఏ, నార్జో 10 మోడల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది.
న్యూఢిల్లీ: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ నార్జో10ఏ, నార్జో10 అనే రెండు మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. నార్జో సిరీస్ పూర్తిగా బడ్జెట్, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అని సంస్థ తెలిపింది. ఇవి పూర్తి సామర్థ్యంతో ఉత్తమమైన గేమింగ్ ప్రొసెసర్‌తో పని చేస్తాయని వెల్లడించింది.
రియల్ మీ నార్జో 10, నార్జో 10ఎ ఫోన్లు డ్యుయల్ నానో సిమ్‌కు సపోర్ట్‌గా ఉండటంతోపాటు ఆండ్రాయిడ్ 10 విత్ రియల్ యూఐ తో పని చేస్తాయి. రెండు ఫోన్లు 6.5 అంగుళాల హెచ్ డీ + 720x1,600 పిక్సెల్స్ సామర్థ్యం కలిగి ఉంటాయి. నార్జో 10 ఫోన్‌కు 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్, నార్జో 10ఏ ఫోన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది.
పబ్‌జీ వంటి ఆన్‌లైన్ గేమ్స్ ఆడటానికి ఇవి అద్భుతంగా పని చేస్తాయని తెలిపింది. మీడియా టెక్ హీలియో జీ 70 ప్రాసెసర్, మీడియా టెక్ హీలియో జీ 80తో విడుదలైన తొలి స్మార్ట్ ఫోన్ నార్జో10 అని రియల్ మీ తెలిపింది.
రియల్ మీ నార్జో 10ఎ మోడల్ ఫోన్ రూ. 8,400లకు లభిస్తుంది. ఇది 3 జీబీ ర్యామ్ విత్ 32 జీబీ స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది. బ్యాకప్ మూడు కెమెరాలతోపాటు 5 ఎంపీ సామర్థ్యం గల సెల్ఫీ కెమెరా, 6.5 ఫుల్ స్కీన్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.
also read ట్విట్టర్ షాకింగ్ న్యూస్: శాశ్వతంగా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం...
మీడియా టెక్ హీలియో జీ 70 ప్రాసెసర్‌తోపాటు 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. అలాగే 3 కార్డు స్లాట్‌ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను దీనికి అనుసంధానించారు.
నార్జో 10 మోడల్ ఫోన్ భారతదేశ మార్కెట్లో రూ. 11,999లకు లభిస్తుంది. 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యం గల ఈ ఫోన్ బ్యాకప్ 48 ఎంపీ కెమెరాతోపాటు 16 ఎంపీల సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
6.5 హెచ్‌డీ డిస్‌ప్లేతోపాటు 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ జత కలిపారు. ఇంకా 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ మీడియా టెక్ హీలియో జీ 80 ప్రాసెసర్ కూడా వీటిలో అందుబాటులో ఉన్నాయి.
నార్జో 10 ఏ ఫోన్ తెలుపు, నీలం రంగుల్లో లభిస్తుంది. నార్జో 10 మోడల్ స్మార్ట్ ఫోన్ తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని రియల్ మీ తెలిపింది. ఈ రెండు ఫోన్లు భారత మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్, రియల్ మీ ఇండియా వెబ్ సైట్‌లో లభ్యం అవుతాయి.
నార్జో 10 ఫోన్ ఈ నెల 18 నుంచి నార్జో 10ఏ ఫోన్ 22 నుంచి లభిస్తుంది. వాస్తవంగా మార్చి 26వ తేదీన ఈ రెండు ఫోన్లను విపణిలో విడుదల చేయాలని రియల్ మీ నిర్ణయించింది కానీ కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది.