ట్విట్టర్ షాకింగ్ న్యూస్: శాశ్వతంగా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం...
కరోనా కల్లోలం వేళ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సంచలన నిర్ణయం తీసుకున్నది. తమ ఉద్యోగులు ఎప్పటికీ వర్క్ ఫ్రం హోం చేసేందుకు ట్విటర్ అనుమతించింది. ఇటువంటి సంచలనం నిర‍్ణయం తీసుకున్న తొలి సంస్థగా ట్విటర్ నిలిచింది.
శాన్‌ఫ్రాన్సిస్కో/ కాలిఫోర్నియా: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో సోషల్ మీడియా కం టెక్ దిగ్గజం ట్విటర్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులు ఎప్పటికీ వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్ని తొలి సంస్థగా ట్విటర్ అవతరించింది. ట్విటర్ సీఈవో జాక్ డోర్సే మంగళవారం కంపెనీ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఇచ్చిన ఈ-మెయిల్ సమాచారంలో ఈ సంగతి చెప్పారు.
ప్రస్తుత కరోనా సంక్షోభం ముగిశాక కూడా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేసేలా కొత్త విధానాన్ని రూపొందించామని ట్విట్టర్ వెల్లడించింది. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు, దీన్ని శాశ్వతంగా కొనసాగించాలని కోరడంతో దాన్ని అనుమతించామని కంపెనీ తెలిపింది.
సెప్టెంబర్ నెల వరకు తమ కార్యాలయాలను తెరిచేది లేదని ట్విట్టర్ వివరించింది. సెప్టెంబర్ నెలకు ముందు చాలా కార్యాలయాలను తిరిగి తెరిచే అవకాశం లేనందున ఆపీసుకు రావాలా? వద్దా? అనేది స్వయంగా వాళ్లే నిర్ణయించుకోవచ్చని వెల్లడించింది.
also read జూమ్ యాప్ కి పోటీ: వాట్సాప్లో ఫేస్‌బుక్ ‘మెసేంజర్ రూం’.. ఒకేసారి 50 మందితో వీడియో కాల్..!
ప్రపంచవ్యాప్తంగా రిమోట్‌గా పని చేసుకునే అవకాశం ఉన్న తమ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటినుంచే పనిచేసుకోవచ్చని ట్విటర్ ప్రకటించింది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విటర్ హెచ్ ఆర్ చీఫ్ జెన్నిఫర్ క్రైస్ట్ వెల్లడించారు.
ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో ఇది ఊహించని నిర్ణయమని పేర్కొన్నారు. సీఈవో జాక్ డోర్సే 2020 మధ్యలో మూడు నుండి ఆరు నెలల వరకు ఆఫ్రికాకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ ప్రస్తుత సంక్షోభ కాలంలో దానిని వాయిదా వేసుకున్నారు.
మరోవైపు కరోనా, లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే ఫేస్‌బుక్, గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులలో చాలా మందిని ఈ సంవత్సరం చివరి వరకు ఇంటినుంచే పనిచేయడానికి అనుమతించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన సన్నాహకాలకుగాను మే 22 న ఒక రోజు సెలవు తీసుకోవాలని ఉద్యోగులను కోరినట్లు గూగుల్ గత వారం తెలిపింది.
కాగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 4.2 మిలియన్లకు పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. చాలా దేశాలలో కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రజారవాణా, వ్యాపార వ్యవస్తలు స్థంభించిపోయీయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పరిస్థితులలో, పనివేళ్లలో కీలక మార్పుల చోటు చేసుకోనున్నాయి.