జీఎస్టీ శ్లాబ్ పెంపు: భారీగా పెరిగిన స్మార్ట్ ఫోన్ల ధరలు

By Arun Kumar PFirst Published Apr 2, 2020, 11:32 AM IST
Highlights

స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగనున్నాయి. గత నెలలో స్మార్ట్ ఫోన్లపై జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. బుధవారం నుంచి ఈ శ్లాబ్ అమలులోకి వచ్చింది. దీన్ని గుర్తు చేస్తూ షియోమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ ట్వీట్ చేస్తూ తమ బ్రాండ్ ఫోన్ల ధరలు 50 శాతం పెరుగుతాయని ప్రకటించారు. రియల్ మీ, ఒప్పో ఫోన్ల ధరలు కూడా వాటి శ్రేణిని బట్టి రూ.500 నుంచి రూ.2000 వరకు పెరిగాయి.

న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగనున్నాయి. స్మార్ట్ ఫోన్లపై జీఎస్టీ శ్లాబ్‌ను 12 నుంచి 18 శాతానికి పెంచుతూ గత నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం (ఏప్రిల్ 1) నుంచి జీఎస్టీ శ్లాబ్ పెరిగింది. తదనుగుణంగా స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగనున్నాయి. 

షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ బుధవారం ఈ విషయమై ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారతదేశంలో తమ కంపెనీ ఫోన్ల ధరలు తక్షణం పెరుగనున్నాయని తెలిపారు. తమ సంస్థ అన్ని ఫోన్ల ధరలు పెరుగుతాయన్నారు. షియోమీ, దాని అనుబంధ ఎంఐ, రెడ్ మీతోపాటు పొకో బ్రాండ్‌ అన్ని మోడల్ ఫోన్లపై ధరలు పెరుగుతాయని చెప్పారు. 

షియోమీ తన హార్డ్ వేర్ ఉత్పత్తులపై ఐదు శాతానికి మించి ఆదాయం పొందరాదన్న సూత్రాన్ని పాటిస్తున్నట్లు మనుకుమార్ జైన్ గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబ్ పెంచడంతో తమకు ఫోన్ల ధరలు పెంచడం తప్ప మరో మార్గం కనిపించలేదన్నారు. షియోమీ ఫోన్ల ధరలపై ఆఫర్లతోపాటు పెరుగుదల అమలులోకి వస్తుందని మను కుమార్ జైన్ పేర్కొన్నారు. 

తదనుగుణంగా ఈ-రిటైలర్ ‘ఫ్లిప్ కార్ట్’లో స్మార్ట్ ఫోన్ల ధరల పెరుగుదల అమలులోకి వచ్చేసింది. పొకొ ఎక్స్2 - 6జీబీ విత్ 128 జీబీ మోడల్ ఫోన్ ధర ఇంతకుముందు రూ.16,999 కాగా, ఇప్పుడు 17,999గా చూపుతోంది. పొకో ఇండియా జనరల్ మేనేజర్ సీ మన్మోహన్ ట్వీట్ ద్వారా పొకొ ఎక్స్ 2 ధర పెరుగుదలపై అప్ డేట్ అందుబాటులోకి తెచ్చారు. 

పొకో ఎక్స్ 2 మోడల్ 6 జీబీ విత్ 64 జీబీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.16,999, 8 జీబీ విత్ 256 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.20,999లకు లభిస్తుంది. రెడ్ మీ కే 20 మోడల్ 6జీబీ విత్ 64 జీబీ వర్షన్ ఫోన్ ధర రూ.2000 పెరుగుతుంది. రెడ్ మీ కే20 ప్రో ఫోన్ 6జీబీ విత్ 128 జీబీ వేరియంట్ ధర కూడా పెరుగనున్నది. 

మరో ఈ-రిటైలర్ అమెజాన్ సంస్థతోపాటు షియోమీ ఇండియా వెబ్‌సైట్‌లో ధరలు త్వరలో అప్ డేట్ చేస్తామని షియోమీ తెలిపింది. మిగతా సంస్థల స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఒప్పో బ్రాండ్ ఫోన్ల ధరలు కూడా పెరిగాయి. ఉదాహరణకు ఒప్పో రెడో 3 ప్రో మోడల్ ఫోన్ ధర గతంతో పోలిస్తే రూ.2000 పెరిగింది. ఒప్పో ఏ1కే మోడల్ ఫోన్ ధర రూ.7490 నుంచి రూ.7999కి, ఒప్పో ఏ5ఎస్ మోడల్ 4జీబీ పోన్ ధర రూ.10,999 నుంచి రూ.11,900లకు పెరిగాయి. 

ఒప్పో ఏ9 మోడల్ 4జీబీ అండ్ 8 జీబీ ఫోన్ల ధరలు రూ.14,990, 17,490 నుంచి రూ.15,990, రూ.18,490లకు పెరిగాయి. ఒప్పో ఎఫ్ 15 ఫోన్ 8జీబీ వేరియంట్ ధర రూ.19,990 నుంచి రూ.21,990కి పెరిగింది. రెనో 2ఎఫ్ ఫోన్ రూ.21,990 నుంచి రూ.23,490కి, రెనో 2జడ్ మోడల్ ధర రూ.25,990 నుంచి రూ.27,990లకు పెరిగాయి.

రియల్ మీ 6, రియల్ మీ 6ప్రో ఫోన్ ధరలు రూ.13,999, రూ.17,999 నుంచి రూ.1000 పెరిగాయి. రియల్ మీ ఎక్స్ 2, రియల్ మీ ఎక్స్2 50 ప్రో, రియల్ మీ ఎక్స్ 50 ప్రో ధరలు రూ.2000 పెరిగాయి. మిగతా రియల్ మీ మోడల్ ఫోన్ల ధరలు కూడా రూ.500 నుంచి రూ.1000 వరకు పెరిగాయి.

click me!