world diabetes day 2023: డయాబెటిస్ చికిత్స లేని వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా ఈ డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వ్యాధిపై జనాలకు అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది నవంబర్ 14 న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఎలాంటివి మనల్ని డయాబెటీస్ బారిన పడేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
world diabetes day 2023: మన దేశంలో రానురాను షుగర్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇది నయం కాని వ్యాధి. అందుకే దీని బారిన పడకూడదని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్తుంటారు. కానీ పెరుగుతున్న పని ఒత్తిడి, మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు డయాబెటీస్ బారిన పడేస్తున్నాయి. ఒక్కప్పుడు ఈ వ్యాధి పెద్దవయసు వారికి మాత్రమే వచ్చేది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య దారుణంగా పెరిగిపోతోంది. అందుకే భారతదేశం డయాబెటిస్ రాజధానిగా మారిపోయింది.
డయాబెటీస్ జీవనశైలి వ్యాధి. దీన్ని నియంత్రించడమే తప్ప పూర్తిగా తగ్గించలేం. మందులు, జీవన శైలి అలవాట్లతో ఈ వ్యాధిని కంట్రోల్ లో ఉంచొచ్చు. డయాబెటిస్ కేసులు ఇంతలా పెరగడానికి జనాలకు దీనిపై తక్కువ పరిజ్ఞానం కూడా ఒక ప్రధాన కారణమేనంటున్నారు నిపుణులు. అందుకే ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది నవంబర్ 14 న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా అసలు ఎలాంటి వాటిని తింటే మధుమేహం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
చక్కెర పానీయాలు
కూల్ డ్రింక్స్, పండ్ల రసాలను చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. ఇవి టేస్టీగా ఉన్నా ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే బయటతాగే పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ లో షుగర్ కంటెంట్ ఇతర హానికరమైన రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని మీరు రెగ్యులర్ గా తాగితే మీకు టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది.
ట్రాన్స్ ఫ్యాట్స్
బిజీబిజీ లైఫ్ స్టైల్ వల్ల మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఆకలిగా అనిపిస్తే ఏవి పడితే అవి కొని తింటుంటారు చాలా మంది. ముఖ్యంగా సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహార పదార్థాలనే ఎక్కువగా తింటుంటారు. కానీ ఈ ఆహారాలు మీ శరీరంలో కొవ్వు, కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. అలాగే ఇవి డయాబెటీస్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. అందుకే ఇలాంటి ఆహారాలను తినకుండా ఉండటమే బెటర్.
రెడ్ మీట్
చాలా మంది రెట్ మీట్ ను బాగా తింటుంటారు. వారానికి రెండు మూడు సార్లు తినేవారు కూడా ఉన్నారు. కానీ ఇది మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెండంతో పాటుగా మీకు డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్నికూడా పెంచుతుంది. ఎక్కువ మొత్తంలో రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని తింటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఇటీవల పలు అధ్యయనాలు వెల్లడించాయి. .
శుద్ధి చేసిన ధాన్యాలు
శుద్ధి చేసిన ధాన్యాలు కూడా మనల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తాయి. అవును వీటిని రెగ్యులర్ గా తింటే గుండె జబ్బులొచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
స్మోకింగ్
స్మోకింగ్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదన్న ముచ్చట అందరికీ తెలుసు. కానీ చాలా మంది ఈ అలవాటును మాత్రం వదులుకోరు. ఇది మిమ్మల్ని క్యాన్సర్ బారిన పడేయడమే కాకుండా.. మీ మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. స్మోకింగ్ చేసే అలవాటున్నవారికి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ అలవాటును వీలైనంత తొందరగా మానుకోవడం మంచిది.