మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి. ఈ కొలెస్ట్రాల్ గుండెపోటు, అధిక రక్తపోటు, స్ట్రోక్ వంటి ఎన్నో డేంజర్ రోగాలకు దారితీస్తుంది.
మన ఆరోగ్యానికి, మనం తినే ఆహారానికి విడదీయరాని సంబంధం ఉందంటారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యకరమైన ఆహారాలను తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి దారితీస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండెపోటుతో సహా ఎన్నో సమస్యలకు దారితీస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బచ్చలికూర
బచ్చలికూరలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. బాడీ ఫ్యాట్ ను తగ్గించే టాప్ ఫుడ్స్ లో ఒకటి బచ్చలికూర. బచ్చలికూరలో విటమిన్ బి, మెగ్నీషియం, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కరుగుతుంది.
అవొకాడో
అవోకాడో లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగుంటాయి. అవొకాడోల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ప్రతిరోజూ ఒక అవొకాడో పండును తినండి.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్స్ ఒత్తిడి నుంచి గుండెను ఆరోగ్యంగా ఉంచడం వరకు ఎన్నో సమస్యలను తగ్గిస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి.
సిట్రస్ పండ్లు
నారింజతో సహా సిట్రస్ పండ్లలో ఉండే ఫైబర్, లిమోనాయిడ్ సమ్మేళనాలు రక్త నాళాలు ఇరుగ్గా మారకుండా నిరోధిస్తాయి. దీంతో ఎల్డిఎల్ స్థాయిలు తగ్గిపోతాయి. అందుకే వీటిని మీ ఆహారంలో చేర్చితే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి.
క్యారెట్లు
క్యారెట్లలో ఫైబర్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. క్యారెట్లను తింటే కళ్లు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే క్యారెట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి.
ఓట్స్
ప్రతిరోజూ ఓట్స్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది.
బెర్రీలు
బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, కోరిందకాయలు వంటి బెర్రీలన్నీ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
కాలీఫ్లవర్
కాలీఫ్లవర్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో కేలరీలు, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. కాలీఫ్లవర్ శరీరంలో ఎక్కువగా ఉన్న కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
గింజలు
గింజలు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి మర్చిపోకుండా ప్రతిరోజూ గుప్పెడు గింజలను తినండి.
బొప్పాయి
బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.