Cockroach Janata Party: అసలేంటీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ?

Published : May 20, 2026, 01:55 PM IST
Cockroach Janata Party

సారాంశం

Cockroach Janata Party:సుప్రీంకోర్టు జడ్జి వ్యాఖ్యలతో మొదలైన 'కాక్‌రోచ్ జనతా పార్టీ' అనే సోషల్ మీడియా ఉద్యమం యువత నిరసనలకు కొత్త వేదికగా, కొత్త రూపంగా మారింది. అభిజీత్ దిప్కే స్థాపించిన ఈ గ్రూప్ ఇప్పుడు… నిరుద్యోగం, అవినీతి వంటి సమస్యలను లేవనెత్తుతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Cockroach Janata Party: మన దేశంలోని  సోషల్ మీడియాలో ఇప్పుడు 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (CJP) హల్చల్ చేస్తోంది. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్… భారత యువతను 'బొద్దింకలు', 'పరాన్నజీవులు' అని పిలిచారనే ఆరోపణలతో ఈ కొత్త ఉద్యమం మొదలైంది. అయితే, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని జస్టిస్ సూర్యకాంత్ తర్వాత వివరణ ఇచ్చారు. ఏదేమైనా, ఈ సంఘటనతో పుట్టిన ఈ ఉద్యమానికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది.

'కాక్‌రోచ్ జనతా పార్టీ'

సామాజిక, రాజకీయ అంశాలపై సెటైర్ల రూపంలో మొదలైన ఈ ఉద్యమం, అనతికాలంలోనే యువత నిరసన గళానికి వేదికగా మారింది. కాక్ రోచ్ జనతా పార్టీ (CJP) పేరుతో ఎక్స్ , ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా ప్రచారం పొందింది. కేవలం మూడు రోజుల్లోనే లక్ష మందికి పైగా తమ పార్టీలో సభ్యులుగా చేరారని CJP నిర్వాహకులు చెబుతున్నారు.

 

 

అభిజీత్ దిప్కే

గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాల్లో పాలుపంచుకున్న అభిజీత్ దిప్కే ఈ ఉద్యమానికి వ్యవస్థాపకుడిగా ఉన్నారని 'ది హిందూ' పత్రిక పేర్కొంది. రాజకీయ విమర్శలు, మీమ్స్‌తో 'కాక్‌రోచ్ జనతా పార్టీ' సోషల్ మీడియాలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పరీక్షల్లో అక్రమాలు, రాజకీయ అవినీతి, వ్యవస్థలపై నమ్మకం కోల్పోవడం వంటి అంశాలను CJP తమ పోస్టుల ద్వారా బలంగా ప్రస్తావిస్తోంది.

 

 

ఐదు సూత్రాల విధానం

తమ పార్టీని “సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రాటిక్, లేజీ” అంటూ వ్యంగ్యంగా పరిచయం చేసుకోవడం సోషల్ మీడియా యూజర్లను బాగా ఆకట్టుకుంది. సెటైరికల్ లాంగ్వేజ్, మీమ్స్ వీరి పొలిటికల్ ఎజెండాను జనంలోకి తీసుకెళ్లడానికి బాగా ఉపయోగపడ్డాయి. మహిళలకు రాజకీయాల్లో ఎక్కువ ప్రాతినిధ్యం, పార్టీలు మారే ప్రజాప్రతినిధులపై నిషేధం, విద్యార్థుల సమస్యలపై దృష్టి వంటి డిమాండ్లతో కూడిన ఐదు సూత్రాల విధానాన్ని ఈ పార్టీ ప్రకటించింది. ముఖ్యంగా పరీక్షల్లో మోసాలు, యువత నిరుద్యోగంపై పార్టీ గట్టిగా గళం విప్పుతోంది.

 

 

దేశవ్యాప్తంగా గుర్తింపు

తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ 'కాక్‌రోచ్ జనతా పార్టీ' మీమ్స్‌ను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవడంతో ఈ పార్టీకి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. దీంతో, రాజకీయ వ్యంగ్యంగా మొదలైన ఈ గ్రూప్, నిజమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మరోవైపు జెన్ జీ యువత తమ రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి తీసుకొచ్చిన కొత్త మార్గం 'కాక్‌రోచ్ జనతా పార్టీ' అని విశ్లేషకులు చెబుతున్నారు. నేపాల్‌లో జరిగిన 'జెన్-Z విప్లవం' లాగా, ఇండియాలో 'కాక్‌రోచ్ జనతా పార్టీ' మారుతుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Railway Station Owner : ఇంటిముందే ట్రైన్ పార్కింగ్.. మనదేశంలో సొంతంగా రైల్వే స్టేషన్ కలిగిన ఒకేఒక్కడు..
Sun disappearance: సూర్యుడు హఠాత్తుగా మాయమైపోతే మనుషులు ఎన్నాళ్లు బతకగలరు? ఏ దేశం సూర్యుడు లేకున్నా సేఫ్?