
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా విశ్వక్ సేన్ నటించిన హిట్ చిత్రం గుర్తుందిగా.. ఆ మూవీ మంచి విజయం సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. సీక్వెల్ హిట్ 2గా తెరెకెక్కింది. హిట్ 2లో అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
అడివి శేష్ పోలీస్ అధికారిగా డిఫెరెంట్ యాటిట్యూడ్ తో కనిపిస్తున్నారు. టీజర్ మొత్తం ఫన్నీగా సాగినా చివర్లో క్రైమ్ అంశాలతో ఒళ్ళు గగుర్పాటుకి గురిచేశారు. అయితే తాజాగా హిట్ 2 చిత్ర యూనిట్ కి యూట్యూబ్ షాకిచ్చింది. హిట్ 2 టీజర్ పై యూట్యూబ్ ఆంక్షలు విధించింది. టీజర్ చివర్లో రక్తపాతం, దారుణమైన క్రైమ్ సీన్ ఉండడంతో యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది.
హిట్ 2 టీజర్ ని ట్రెండింగ్ లిస్ట్ నుంచి డిలీట్ చేస్తూ వయసు పరిమితి విధించింది. ఇప్పుడు హిట్ 2 టీజర్ చూడాలంటే 18 ఏళ్ళు నిండిన వారు సైన్ ఇన్ అయి మాత్రమే చూడగలరు. దీనితో అడివి శేష్ సోషల్ మీడియాలో స్పందించారు. యూట్యూబ్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం అని తెలిపారు. 18 ఏళ్ళు నిండిన వారు ఈ టీజర్ ని చూడవచ్చు అని తెలిపారు. ఇదంతా తాము ముందుగానే ఊహించాం అని అడివి శేష్ తెలిపాడు.
కైలేష్ కొలను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో భయపెట్టే అంశాలు చాలానే ఉన్నాయని అడివి శేష్ టీజర్ లాంచ్ లోనే హింట్ ఇచ్చాడు. డిసెంబర్ 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. అడివి శేష్ కి జోడిగా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.