
సమంత తన అనారోగ్యానికి గురించి ఆమె చెబుతూ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ వీడియో వైరల్ అయ్యింది. కానీ `యశోద` షూటింగ్‌లో నిజంగానే కన్నీళ్లు పెట్టుకుందట సమంత. ఎమోషనల్ సీన్లలో ఆమె గ్లిజరిన్ వాడకుండానే కన్నీళ్లు పెట్టుకుందట. ఎంతటి సీన్ అయినా సింగిల్ టేక్‌లో చేస్తుందట. తాజాగా ఈ విషయాలను దర్శకులు హరి-హరీష్ వెల్లడించారు.
సమంత మెయిన్ లీడ్‌గా నటించిన `యశోద` చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకాలపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. తాజాగా హరీ-హరీష్ సినిమా గురించి మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సమంతతో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్ పిరీయెన్స్ అని తెలిపారు. మొదట ఈ సినిమాని మూడు,నాలుగు కోట్ల బడ్జెట్‌లోనే చేయాలనుకున్నామని, కానీ నిర్మాత కృష్ణ ప్రసాద్ వచ్చాక సినిమా స్కేల్ పెరిగిందని, పాన్ ఇండియా సినిమాగా మారిపోయిందన్నారు.
`సమంత ఎంత పెద్ద ఎమోషనల్ సీన్ అయినా సరే రెండు నిమిషాల సమయం అడుగుతారు. సెట్ అంతా సైలెన్స్ అయ్యాక ఈజీగా చేసేస్తారు. గ్లిజరిన్ కూడా వాడరు. మేం ఏం కోరుకొన్నామో.. అది ఈజీగా ఇచ్చేసేవారు. మేం చేసిన సినిమాల్లో ఎమోషనల్ సీన్ ఇది. మహిళలు, మాతృత్వం గురించి చెప్పాం. సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఆవిడ చాలా బాగా చేశారు. 'మీకు ఓకేనా? వన్ మోర్ కావాలా?' అని అడిగేవార`ని చెప్పారు దర్శకులు. సినిమాలో ప్రతి 20 నిమిషాలకు సినిమాలో ఒక మూవ్ ఉంటుంది. అది సినిమాని నెక్స్ట్ లెవల్ కు వెళుతుంది. సర్‌ప్రైజ్‌లు షాక్ ఇస్తాయి, కొత్త అనుభూతినిస్తాయి` అని తెలిపారు.
సినిమా స్టోరీ గురించి చెబుతూ, సరోగసీ మెయిన్ స్టోరీ కాదని, అది కథలో ఓ భాగం మాత్రమే అని, అందుకే ఆ విషయాన్ని ఓపెన్‌గా చెప్పామన్నారు. సరోగసీ కంటే కథలో ఇంకా మెయిన్ ఎలిమెంట్ వేరే ఉందన్నారు. మెడికల్ మాఫియా వంటి అంశాలుంటాయన్నారు. వార్తల్లో చూసిన, చదివిన విషయాల ఆధారంగా స్క్రిప్ట్ రాశామని, సినిమా చూసినప్పుడు మీరు షాక్ అవుతారన్నారు.
సమంత అనారోగ్యంపై రియాక్ట్ అవుతూ, షూటింగ్ సమయంలో తమకు తెలియదని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగేటప్పుడు తెలిసిందన్నారు. `సమంత వల్ల ఎప్పుడూ షూటింగ్ డిస్టర్బ్ కాలేదు. ఒక స్టంట్ సీన్ అద్భుతంగా చేశారు. ఆ రోజు సాయంత్రం ప్యాకప్ చెప్పేటప్పుడు ఆవిడకు జ్వరం ఉందని తెలిసింది. ఆవిడకు వర్క్ అంటే అంత డెడికేషన్. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని కోరుకుంటారు. హాలీవుడ్ స్టంట్‌మెన్ యానిక్ బెన్ రెండు, వెంకట్ మాస్టర్ మూడు స్టంట్ సీన్స్ చేశారు` అని తెలిపారు.
సరోగసి చెబుతూ, సరోగసీ మీద చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ టాపిక్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. మాకు అది సర్‌ప్రైజింగ్‌గా ఉంది. లాక్‌డౌన్‌లో చాలా మంది పేద మహిళలు డబ్బుల కోసం తమ గర్భాన్ని సరొగసీకి ఇచ్చారు. ట్విన్స్ పుడితే వాళ్ళకు ఎక్కువ డబ్బులు వస్తాయి. దానికి కూడా వాళ్ళు ఓకే అనేవారు. అయితే ఇందులో ప్రెగ్నెన్సీ వారిని రియల్ గర్భవతులతో నటింప చేశాం` అని చెప్పారు.
సినిమాలో `ఈవా` అని సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు పేరు పెట్టాం. ఆ సెంటర్ గ్రాండ్ గా ఉండాలని ఊహించుకున్నాం. దాని కోసం హైదరాబాద్ సిటీలో స్టార్ హోటల్స్ అన్నీ చూశాం. స్టార్ హోటల్స్ అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అప్పుడు నిర్మాతను అడిగితే సెట్ వేద్దామన్నారు. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారితో 'జురాసిక్ పార్క్'లా ఉండాలని చెప్పాం. ఆయన అద్భుతమైన స్కెచ్ ఇచ్చారు. కృష్ణప్రసాద్ గారు ఖర్చు విషయంలో రాజీ పడలేదు. పాన్ ఇండియా కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రజలు కనెక్ట్ అయ్యేలా ఉండాలనుకున్నాం. అ రకంగానే తెరకెక్కించాం` అని తెలిపారు దర్శక ద్వయం హరి-హరీష్.