
యువ గాయని రక్షిత సురేష్ సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. 2015లో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన రక్షిత సురేష్ ప్రస్తుతం సింగర్ గా పలు అవకాశాలు అందుకుంటోంది. తాజాగా ఆమె ఘోర ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ బయటపడ్డారు.
రక్షిత సురేష్ ప్రస్తుతం మలేషియాలో ఉన్నారు. ఇండియాకి తిరిగి వచ్చేందుకు ఎయిర్పోర్ట్ కి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు రక్షిత సురేష్ సోషల్ మీడియాలో తెలిపింది. ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ కి ఢీకొట్టిందట.
' నేను ఈ రోజు మేజర్ యాక్సిడెంట్ కి గురయ్యాను. నేను ప్రయాణిస్తున్న కారు వేగంగా డివైడర్ ని ధీ కొట్టింది. ఒక్కసారిగా పక్కకి దూసుకెళ్లింది. మలేషియాలో విమానాశ్రయంకి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ క్షణాలలో నా జీవితం మొత్తం ఒక్కసారిగా కళ్ళముందు ఫ్లాష్ అయినట్లు అనిపించింది. ఎయిర్ బ్యాగ్స్ మమ్మల్ని కాపాడాయి. లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేను.
ఈ ఎఫెక్ట్ నుంచి నేను ఇంకా బయటపడలేదు. ఇప్పటికీ వణికిపోతున్నా. నేను, డ్రైవర్, కారులో ప్రయాణిస్తున్న ఇతరులు అంతా సేఫ్ గా చిన్న చిన్న గాయాలతో బయట పడ్డాం. అదృష్టం కొద్దీ ప్రాణాలతో ఉన్నాం అనిపిస్తోంది' అంటూ రక్షిత సురేష్ పోస్ట్ చేశారు.
ఆమె పోస్ట్ కి ప్రముఖులంతా రియాక్ట్ అవుతున్నారు. ప్రముఖ సింగర్ గీతా మాధురి 'థ్యాంక్ గాడ్.. నీవు త్వరగా కోలుకోవాలి' అని కామెంట్ పెట్టింది. రక్షిత సురేష్ చివరగా పొన్నియిన్ సెల్వన్ 2లో తమిళ వెర్షన్ కోసం 'కీరునగె' అనే సాంగ్ పాడారు. ఆమె తెలుగులో నాగ చైతన్య లవ్ స్టోరీ చిత్రంలో 'ముత్యాల చెమ్మ చెక్క' అనే సాంగ్ ని కూడా పాడారు. మరికొన్ని చిత్రాల్లో కూడా ఆమె పాటలు పాడారు.