
మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో అనేది పెద్ద సందిగ్దం నెలకొంది. చాలా మంది డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. పూరీ జగన్నాథ్, వి వి వినాయక్ వంటి దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇటీవల ఓ కొత్త దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. `బింబిసార` చిత్రంతో ఆకట్టుకున్న వశిష్ట చిరంజీవికి కథ చెప్పాడట. ఆ కథకి ఇంప్రెస్ అయిన చిరు వెంటనే ఓకే చేశారని, తన నెక్ట్స్ సినిమాగా ఇదే తెరకెక్కుతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ సెట్ అయిన తీరు క్రేజీగా ఉండటం విశేషం. నిజానికి దర్శకుడు వశిష్ట.. రామ్‌చరణ్‌తో సినిమా చేయడానికి వెళ్లారు. ఆయనకు స్టోరీ నెరేట్ చేయడానికి వెళ్లగా, మొదట కథని చిరంజీవి విన్నారు. ఈ కథతోపాటు మరో కాన్సెప్ట్ ని చిరంజీవితో షేర్ చేసుకున్నారు వశిష్ట. అది మెగాస్టార్ కి తెగ నచ్చింది. అంతే.. చరణ్ కోసం తెచ్చిన కథ పక్కకెళ్లింది. ఇప్పుడు కొత్తగా చెప్పిన లైన్.. ట్రాక్ ఎక్కింది. దాన్ని స్క్రిప్ట్ గా చేసుకుని రమ్మని వశిష్టకి చెప్పారు చిరు. దీంతో కథగా మలిచి చిరుకి చెప్పడం, ఆయనకు నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది.
ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఫైనల్ స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో వశిష్ట ఉన్నారట. ఇది సోషియో ఫాంటసీగా సాగే కథ అని తెలుస్తుంది. చిరు ఇప్పటి వరకు చేయనటువంటి కథ అని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన డేట్స్ కూడా ఇచ్చారట చిరంజీవి. ఆగస్ట్ నుంచి ఈ సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉందట. వీఎఫ్‌ఎక్స్ కి ఎక్కువగా స్కోప్ ఉన్న సినిమా కావడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే ఎక్కువ టైమ్ తీసుకుంటున్నట్టు సమాచారం.
ఇక ప్రస్తుతం చిరంజీవి `భోళాశంకర్` చిత్రంలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. తమిళంలో వచ్చిన `వేదాళం` చిత్రానికిది రీమేక్. ఇందులో చిరుకి జోడీగా తమన్నా నటిస్తుంది. చిరుకి చెల్లిగా కీర్తిసురేష్ నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఆగస్ట్ లో విడుదల కాబోతుంది. మరోవైపు వశిష్ట చివరగా కళ్యాణ్ రామ్‌తో `బింబిసార` చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్‌ని కూడా ప్రకటించారు. దీనికి ఆయనే దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ చిత్ర నిర్మాణ సంస్థతో ఏర్పడి బేధాభిప్రాయాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి వశిష్ట తప్పుకున్నారు. ఆయన్ని తప్పించినట్టు సమాచారం. ఓ యంగ్ డైరెక్టర్‌తో ఆ సినిమా చేయబోతున్నారట.
అయితే అదే సమయంలో వశిష్ట .. సూపర్ స్టార్ రజనీకాంత్‌కి, బాలకృష్ణకి కూడా కథలు చెప్పారు. వాళ్లు ఆసక్తి చూపించినప్పటికీ అక్కడి నుంచి క్లారిటీ లేదు. ఈ లోపు చిరంజీవి ఓకే అనడంతో ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో పడ్డారు. మొత్తంగా రామ్‌చరణ్ కోసం వెళితే, చిరంజీవి దొరకడం వశిష్టకి లక్కే అని చెప్పొచ్చు.