
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మార్నింగ్ షో నుంచే సినిమాకు హిట్ టాక్ లభించింది. దాంతో వైయస్ అభిమానులు, చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రక్క యాత్ర టీమ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. చిత్ర దర్శకుడు మహి వి రాఘవ, నిర్మాత విజయ్ చల్లాలు వైఎస్ జగన్‌ను కలిసారు.
ఈ నేపధ్యంలో చిత్రం విజయం సాధించిన సందర్భంగా జగన్ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘మహానేత రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని సినిమాగా తెరకెక్కించటంలో మీరు చూపించిన అభిరుచి, అకింతభావానికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు’ అంటూ చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులను అభినందిస్తూ ట్వీట్ చేసారు.
మమ్ముట్టి, రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. 70 ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు నిర్మించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే హిట్ టాక్ రావటంతో చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేశారు.
ఇక ఈ సినిమాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ రాజన్నను గుర్తుకు తెచ్చుకుని.. నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయామని..‘యాత్ర’ సినిమా కాదు.. మహానాయకుడి జీవితం.. రాజన్న వ్యక్తిత్వానికి నిలువుటద్దం.. ఇచ్చిన మాటకు కట్టుబడేందుకు ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్దమయ్యే రాజన్న తెగువ, ధైర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని, సినిమా చూస్తున్నంత సేపు రాజన్నను చూస్తున్నట్టే ఉందని రాజన్నకు యాత్ర ఘన నివాళి అంటూ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు.