చిత్ర పరిశ్రమలో విషాదం.. `సోగ్గాడు` రైటర్‌ కన్నుమూత..

By Aithagoni RajuFirst Published Jan 16, 2023, 8:11 AM IST
Highlights

ప్రముఖ తెలుగు, తమిళ రచయిత భూపతిరాజా తండ్రి, పాపులర్‌ దిగ్గజ రైటర్‌ బాలమురుగన్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. రైటర్‌ భూపతి రాజా తండ్రి, ప్రముఖ తమిళ రచయిత బాలమురుగన్‌(86) కన్నుమూశారు. గత కొంత కాలంగా వయోభారం, అనారోగ్యం కారణంగా ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, తెలుగు, తమిళంలో రచయితగా రాణిస్తున్న భూపతిరాజా వెల్లడించారు. బాలమురుగన్‌ తమిళంతోపాటు పలు తెలుగు సినిమాలకు కూడా కథలు అందించారు. 

తెలుగులో ఆయన కథలు అందించిన వాటిలో `ధర్మదాత`, `ఆలుమగలు`, `సోగ్గాడు`, `సావాసగాళ్లు`, `జీవన తీరాలు` వంటి పలు విజయవంతమైన సినిమాలున్నాయి. అల్లు అరవింద్‌ కి చెందిన గీతా ఆర్ట్స్ మొదటి సినిమా `బంట్రోతు భార్య` సినిమాకు కూడా బాలమురుగనే స్టోరీ అందించడం విశేషం. అలాగే ఆయన కథ అందించిన శోభన్‌బాబు హీరోగా తెరకెక్కిన `సోగ్గాడు` సినిమా ఎంత భారీ విజయం సాధించిందో తెలిసిందే. 

తమిళంలో లెజెండరీ నటుడు శివాజీ గణేశన్‌కి దాదాపు నలభై సినిమాలకు బాలమురుగన్‌ కథలు అందించడం విశేషం. బాలమురుగన్‌ మరణంతో భూపతిరాజా ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలుగు, తమిళ సినీ ప్రముఖులు బాలమురుగన్‌ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. 

click me!