ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్టార్స్ గా వెలుగొందుతున్న ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ఝలక్ ఇచ్చాడు. వారికి పోటీగా మూవీ విడుదల చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు.
అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు తెలుగు సినిమాకు రెండు కళ్ళు. 1950లలో మొదలైన వారి లెగసీ మూడు దశాబ్దాల పాటు కొనసాగింది. 80లలో మరో తరం హీరోలు వచ్చే వరకు వారిద్దరికీ పోటీ లేదు. ఎన్టీఆర్,ఏఎన్నార్ అతిపెద్ద కమర్షియల్ హీరోలుగా ఉండేవారు. నువ్వా నేనా అని పోటీ పడేవారు.
ఎన్టీఆర్ మాస్, పౌరాణిక చిత్రాలతో ప్రసిద్ధి చెందారు. మరోవైపు ఏఎన్నార్ లవ్, ఎమోషనల్, క్లాసిక్ డ్రామాలతో ప్రేక్షకుల్లో ఫేమ్ రాబట్టారు. అయితే అగ్ర స్థానం ఎన్టీఆర్దే. తర్వాత ఏఎన్నార్ అని చెప్పొచ్చు. కాగా వీరిద్దరికీ పోటీగా మూవీ విడుదల చేసి హిట్ కొట్టాడు ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్.
undefined
స్టార్ హీరో ఉండటం సినిమాకు అడ్వాంటేజ్. అయితే కథే కీలకం. మంచి కథను దర్శకుడు సిల్వర్ స్క్రీన్ పై ఆసక్తికరంగా ప్రెజెంట్ చేస్తే విజయం దక్కుతుంది. ఎన్టీఆర్ అయినా, ఏఎన్నార్ అయినా... కథలో విషయం లేకపోతే సినిమాను ప్రేక్షకులు ఆదరించరు. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది.
అలా కథా బలంతో తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్, ఏఎన్నార్ ల చిత్రాలను ఢీ కొట్టింది. ఆ చిత్రంలో స్టార్ క్యాస్ట్ లేరు. కథే హీరో. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రధాన పాత్ర చేశాడు. ఆ చిత్రం పేరు తాత మనవడు.
1973 మార్చి 23న సమ్మర్ కానుకగా తాత మనవడు చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు. ఎస్వీ రంగారావు, రాజబాబు ప్రధాన పాత్రలు చేశారు. అంజలి ఆయన భార్య పాత్ర చేసింది. కైకాల సత్యనారాయణ, విజయ నిర్మల ఇతర కీలక రోల్స్ లో కనిపించారు.
తాత మనవడు విడుదల కావడానికి ఒక వారం రోజుల ముందు ఏఎన్నార్ నటించిన బంగారు బాబు విడుదలైంది. ఈ చిత్రానికి జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ దర్శక నిర్మాత. వాణిశ్రీ హీరోయిన్. 1971లో వీరి కాంబోలో వచ్చిన దసరా బుల్లోడు బ్లాక్ బస్టర్. దాంతో బంగారు బాబు చిత్రం పై హైప్ ఉంది.
అలాగే తాత మనవడు రిలీజైన వారం తర్వాత ఎన్టీఆర్ నటించిన దేశోద్ధారకుడు థియేటర్స్ లోకి వచ్చింది. ఇద్దరు స్టార్ హీరోల చిత్రాల మధ్య ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేని తాత మనవడు విడుదల చేశారు.
ఎన్టీఆర్ దేశోద్ధారకుడు, ఎన్టీఆర్ బంగారు బాబు చిత్రాలను కాదని తాత మనవడు చిత్రాన్ని ఎవరు చూస్తారు? రాంగ్ టైం లో విడుదల చేశారని పరిశ్రమ వర్గాలు భావించాయి. దానికి తోడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కారణంగా కరెంట్ కోతలట. జనరేటర్స్ తో సినిమాలు ప్రదర్శిస్తూ థియేటర్స్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట.
ఇన్ని ప్రతికూలతల మధ్య విడుదలైన తాత మనవడు సూపర్ హిట్ అందుకుంది. మానవ సంబంధాలు ప్రధానంగా ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తాత మనవడు తెరకెక్కింది. ఎస్వీ రంగారావు మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. తాత మనవడు వంద రోజులకు పైగా ప్రదర్శించబడింది.
అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం కావడంతో నిర్మాతకు భారీ లాభాలు వచ్చాయి. అటు బంగారు బాబు, దేశోద్ధారకుడు సైతం విజయాలు నమోదు చేశాయి. స్టార్ హీరోల హిట్ చిత్రాలను తట్టుకుని తాత మనవడు నిలబడటానికి కారణం... కథాబలం అని చెప్పొచ్చు.
నటుడు కావాలని పరిశ్రమకు వచ్చిన దాసరి నారాయణరావు రచయితగా మారాడు. దాదాపు 25 సినిమాలకు ఆయన ఘోస్ట్ రైటర్ గా పని చేశాడట. అనంతరం తాత మనవడు చిత్రంతో దర్శకుడు అయ్యాడు. మొదటి చిత్రంలోనే ఎస్వీఆర్ వంటి దిగ్గజ నటుడితో పని చేసే అవకాశం దక్కించుకున్నారు.
తాత మనవడు సక్సెస్ నేపథ్యంలో సేమ్ కాంబోలో సంసారం-సాగరం చిత్రం తెరకెక్కించాడు దాసరి. ఈ చిత్రంలో కూడా ఎస్వీఆర్, కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రలు చేశారు. తాత మనవడు స్థాయి విజయం అయితే దక్కలేదు.
దాసరి దర్శకుడిగా ఎదుగుతూ వచ్చాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో భారీ కమర్షియల్ హిట్స్ కొట్టాడు. టాలీవుడ్ లెజెండరీ దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా కూడా ఆయన రాణించారు. ప్రధాన పాత్రలు సైతం చేశారు. దాసరి నారాయణరావు నటించిన మామగారు ప్రేక్షకుల ఆల్ టైం ఫేవరేట్ మూవీ. 75 ఏళ్ల వయసులో దాసరి నారాయణరావు 2017లో కన్నుమూశారు.