చిరంజీవి వశిష్ట మూవీకి బిజినెస్ మొదలైంది. ఓవర్ సీస్ మంచి రేటుకు అమ్ముడైంది.
భోళా శంకర్ తర్వాత చిరంజీవి ఏ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ చేస్తారని ఆసక్తిగా ఎదురు చూసిన సంగతి తెలిసిందే. అయితే అందరూ అనుకున్నట్లే చిరంజీవి, వశిష్ట కాంబినేషన్ లో సినిమా మొదలైంది. 'విశ్వంభర' టైటిల్ తో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. తాను ఫిబ్రవరి 1 నుండి 'విశ్వంభర' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా చిరంజీవి చెప్పారు. సుమారు రెండు వారాలు ఈ సినిమా షూటింగ్ లో చిరంజీవి పాల్గొంటారని తెలిసింది. అలాగే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా రివీల్ చేస్తూ టీజర్ ఒకటి విడుదల చేశారు, అది వైరల్ అయింది కూడా. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ప్రారంభమైంది. ఆల్రెడీ ఓవర్ సీస్ రైట్స్ ని రికార్డ్ ప్రైస్ కు అమ్మేసినట్లు ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది.
ఇక ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్. ఈ క్రమంలో ఈ భారీ చిత్రం ఓవర్సీస్ హక్కులు 18 కోట్లకు రికార్డు ధరకు అమ్ముడయ్యాయి, ఇది చిరంజీవి కెరీర్‌లోనే రికార్డ్ ప్రైస్ అని చెప్తున్నారు. సరిగమ సినిమా ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఇటీవల, ఇలాంటి ఫాంటసీ చిత్రాలు భారీ సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్‌లకు ఆకర్షిస్తున్నాయి . రీసెంట్ బ్లాక్‌బస్టర్ హనుమాన్ ట్రెండ్‌కు సరైన ఉదాహరణ. దాంతో ఈ రేటు పెట్టి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
సోషియో ఫాంటసీ నేపథ్యంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో VFX వర్క్స్ చాలా ఉన్నాయి. విశ్వంభర విజువల్ వండర్ లా ఉండబోతుంది. ఈ చిత్రం కథ మూడు లోకాల్లో తిరుగుతుందిట. అందుకే ముల్లోకాల వీరుడు అనే టైటిల్ మొదట అనుకున్నారట. అయితే ఆ టైటిల్ బాగున్నా ఏదో డబ్బింగ్ సినిమా టైటిల్లా ఉందని భావించారట. దాంతో విశ్వంభర అనే టైటిల్ ని పెడదామనే నిర్ణయానికి వచ్చినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. విశ్వంభర వినటానికి బాగుందని, ఈ కథకు, చిరు ఇమేజ్‌కు సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నారట. దసరా సందర్భంగా ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు క్లాప్ కొట్టారు. ఈ మూవీకి యూవీ క్రియేషన్స్ దాదాపుగా రెండు వందల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్టు తెలుస్తోంది.