నామినేషన్ తిరస్కరణపై విశాల్ సీరియస్.. రోడ్డుపై ధర్నా, ఉద్రిక్తత

First Published Dec 5, 2017, 6:29 PM IST
Highlights
  • ఆర్ కె నగర్ ఉపఎన్నికల బరిలో నిలిచిన విశాల్ నామినేషన్ తిరస్కరణ
  • నామినేషన్ తిరస్కరణపై విశాల్ సీరియస్, ధర్మా
  • ఉద్దేశపూర్వకంగానే చేశారని, కోర్టులో పోరాడతానని స్పష్టం చేసిన విశాల్

జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కె నగర్ ఉపఎన్నికల బరిలో నిలుస్తూ తమిళ హీరో విశాల్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఎన్నికల కమిషన్ విశాల్ నామినేషన్ తిరస్కరించింది. ఆర్ కె నగర్ ఉపఎన్నికల బరిలో ఈసీ తన నామినేషన్ తిరస్కరించడంపై విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

తాను కోర్టుకు వెళ్లయినా విశాల్ దీనిపై తేల్చుకుంటానని అంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే తన నామినేషన్ తిరస్కరించారని రోడ్డుపై ధర్నాకు దిగారు విశాల్. అభిమానులతో కలిసి రోడ్డుపై ధర్మాకు దిగటంతో ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ తిరస్కరించడంలో ఆంతర్యమేంటో తనకు అర్థం కావటంలేదని విశాల్ ఆరోపిస్తున్నారు. అన్నీ సరిగ్గానే వున్నాయని, కావాలనే నామినేషన్ తిరస్కరించారని ఆరోపించారు. కోర్టుకు వెళ్లి పోరాడతానని స్పష్టం చేశారు.

 

కాగా సోమవారం జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం నామినేషన్‌ సెంటర్‌కు వెళ్లిన విశాల్ స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పత్రాలు సంబంధిత అధికారులకు అందించాడు. తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదర్శమని ప్రకటించిన విశాల్‌.. అమ్మ ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఓ అవకాశం ఇవ్వాలని ఆర్కే నగర్‌ ప్రజలను కోరాడు.

 

స్వతంత్ర్య అభ్యర్థి విశాల్ నామినేషన్‌ వేసేందుకు అక్కడికి చేరుకోగా.. భద్రతా సిబ్బంది మిగతా స్వతంత్రులను లోపలికి అనుమతించలేదు. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ కూడా తమలాగే మాములు వ్యక్తి అని.. అతని కోసం ఎదురు చూడాల్సిన అవసరం తమకు లేదంటూ వారంతా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ఫ తోపులాట కూడా జరిగింది.

 

డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్, అన్నాడీఎంకే అభ్యర్థిగా మధుసూదనన్, అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరపున  దినకరన్‌, బీజేపీ తరపున అభ్యర్థి కరు నాగరాజన్ ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులుగా పోటీపడుతున్న విషయం తెలిసిందే.  ఇప్పుడు తమిళనాట క్రేజ్‌ సంపాదించుకున్న మాస్‌ హీరో విశాల్‌  బరిలోకి దిగటంతో పోటీ మరింత రసవత్తరంగా మారుతుందనుకుంటే విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అంతేకాక జయ మేనకోడలు దీప నామినేషన్ కూడా తిరస్కరించడంతో ఉపఎన్నిక క్షణక్షణం రసవత్తరంగా మారుతోంది.

కేవలం టీడీఎస్ కట్టలేదని అనర్హత వేయటం అర్థం కావట్లేదని, దీనిపై కోర్టులోనే తేల్చుకుంటానని విశాల్ స్పష్టం చేశారు. మరి కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

click me!