
`ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా?.. నీ గురించి అంతా తెలిసినా నీ స్నేహితుడే` అని అంటున్నాడు ప్రకాష్ రాజ్. విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న చిత్రం `ఎనిమీ`. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. మమతా మోహన్‌దాస్, మృణాళిని రవి హీరోయిన్లు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. శనివారం సాయంత్రం తెలుగు, తమిళంలో టీజర్ రిలీజ్ చేశారు.
ఆద్యంతం ఉత్కంఠభరిత యాక్షన్ అంశాలతో ఈ టీజర్ సాగుతుంది. గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. ఇందులో విశాల్, ఆర్య స్నేహితులని, కానీ కొన్ని ఘటనలతో ఇద్దరు శత్రువులుగా మారిపోతారని, ఆ తర్వాత వీరిద్దరి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర కథ అని టీజర్‌ని బట్టి తెలుస్తుంది. ఇందులో విశాల్ హీరోగా, ఆర్య విలన్ పాత్రలో కనిపిస్తున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన వాయిస్ ఓవర్‌తో వచ్చే `ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా?.. నీ గురించి అంతా తెలిసినా నీ స్నేహితుడే` డైలాగు ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతున్నట్టు సమాచారం.