
ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ పొన్నియిన్ సెల్వన్ 1. ఈ సినిమా గురించి తాజాగా అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలోని పోస్టర్స్ ని కొన్నిటిని విడుదల చేసారు.
ప్రధానమైన పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్స్ చూస్తుంటే ఈ సినిమాపై మరింతగా ఆసక్తి పెరిగిపోతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో తమిళ నటుడు విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష కనిపించనున్నారు. వీరికి సంబంధించిన పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే విక్రమ్ పోస్టర్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్ మొదలయ్యాయి. విక్రమ్ లుక్ అసలు బాగోలేదని, అంత పెద్ద సినిమా నుంచి లుక్స్ విడుదల చేసేటప్పుడు మినిమం రెస్పాన్సబులటీ ఉండదా అని విక్రమ్ ఫ్యాన్స్ మణిరత్నం పై కామెంట్స్ దాడి మొదలెట్టాడు. విక్రమ్ కూడా అదే స్దాయిలో కోపంగా ఉన్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మణిరత్నం అభిమానులు మాత్రం ఆయన్ని వెనకేసుకు వస్తున్నారు. అంత పెద్ద ప్రాజెక్టు జరుగుతున్నప్పుడు ప్రతీది పట్టించుకోవాలంటే కష్టమని అంటున్నారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇది 10వ శతాబ్దంలో చోళరాజుల కాలానికి సంబంధించిన కథ . ఆ కాలంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఆధారంగా చేసుకుని దాని చుట్టూ అల్లుకున్న కథ ఇది. ప్రముఖ రచయత కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ అనే చారిత్రక నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. విజువల్ వండర్‌గా ఈ సినిమాను భారీ క్యాస్ట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మణి రత్నం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదలకానుంది.