`సూపర్‌స్టార్‌` ట్యాగ్‌పై విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు.. పూరీ నాన్న, ఛార్మి అమ్మ అంటూ..

By Aithagoni RajuFirst Published Aug 15, 2022, 12:17 AM IST
Highlights

విజయ్ దేవరకొండ `సూపర్‌ స్టార్‌` ట్యాగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పూరీ జగన్నాథ్‌ని నాన్నలాగా, చార్మిని అమ్మలాగా భావించి ఇండియాని ఏలడానికి ముంబాయి వెళ్లినట్టు చెప్పారు.

`నన్ను అప్పుడే సూపర్‌ స్టార్‌ అని పిలుస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ పేరుకి తగినంత నేనింకా చేయలేదు. ఇంకా చాలా చేయాలి` అని అన్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన చిత్రం `లైగర్‌`. అనన్య పాండే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. ఛార్మి, కరణ్‌ జోహార్‌ నిర్మించారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన ఈసినిమా ఆగస్ట్ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

అందులో భాగంగా ఆదివారం వరంగల్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `లైగర్‌` సినిమాతో ఇండియా షేక్‌ చేయాలని వెళ్లామని తెలిపారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇండియాలో సగం తిరిగామని, కానీ ఎక్కడున్న మనవాళ్ల గురించే ఆలోచన, మన తెలంగాణలో, ఏపీలో ఏం జరుగుతుందనేది, ఇక్కడ `లైగర్‌` గురించి ఏం నడుస్తుందనేది, ఏమనుకుంటున్నారనేది ఒక్కటే ఆలోచన. చాలా మిస్‌ అయినం. త్వరగా ఈవెంట్‌ పెట్టాలని ఈ రోజు ఈవెంట్‌ పెట్టామని తెలిపారు విజయ్. 

ఆయన ఇంకా చెబుతూ, `లైగర్‌`లో ఓ సరూర్‌ నగర్‌ పొరగాడు, వాళ్లమ్మ కలిసి ముంబయి వెళ్తారు ఇండియా షేక్‌ చేద్దామని. కొడుకుని ఛాంపియన్‌ని చేయాలని అమ్మ అనుకుంటుంది. మేం కూడా అంతే, మా లైఫ్‌ కూడా అంతే. కానీ నన్ను రోజూ సూపర్‌ స్టార్‌ సూపర్‌స్టార్‌ అని పిలుస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఆ పేరుకి నేనింకా తగినంత చేయలేదు. ఇంకా చాలా చేయాలి. కాకపోతే నేనూ కూడా బయలు దేరా చాలా చేయాలని. పూరీ మా నాన్నలాగా, ఛార్మి మా అమ్మలాగా, ముగ్గురం కలిసి ముంబాయికి వెళ్ళినం, ఇండియా షేక్‌ చేయాలని. ఇంక ఏం ఇబ్బంది వచ్చినా, ఎవరు అడ్డు వచ్చినా, ఎవరి మాట వినేదే లేదు. కొట్టాల్సిందే అని ఫిక్స్ అయిపోయినం` అని చెప్పారు. 

ఈ సందర్భంగా సినిమాలోని తనకిష్టమైన డైలాగ్‌ గురించి చెబుతూ, పూరీ గారి సినిమాల్లో డైలాగులు చెప్పాలంటే ఒక బ్లెస్‌ ఉండాలి. అది మామూలు విషయం కాదు. కానీ నేను చెప్పగలిగినా. సినిమాలో ఓ డైలాగ్‌ నాకు చాలా ఇష్టం. `వీ ఆర్‌ ఇండియన్స్, పోదాం కొట్లాడదాం. ఆగ్‌ హై అందర్‌, దునియాకో ఆగ్‌ లాగా దేంగే, సబ్‌కి వాట్‌ లాగా దేంగే.. ఆగస్ట్ 25న మనందరం కలిసి వాట్‌ లాగా దేంగే మనం గట్టిగా కొట్టాలి` అని చెప్పాడు విజయ్‌ దేవరకొండ. 

మీరు(అభిమానులు) ఇచ్చిన ప్రేమని మర్చిపోలేను, ఎక్కడకు వెళ్లినా విపరీతమైన ప్రేమని చూపిస్తున్నారు. ఎంతో మంది వస్తున్నారు ఆదరిస్తున్నారు. మీరంతా ఇచ్చిన ప్రేమని తిరిగివ్వాలి. మీరు అరిచిన ప్రతి అరుపుకి ఆగస్ట్ 25న ఫుల్‌గా తిరిగివ్వాలి` అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నిర్మాత ఛార్మి, హీరోయిన్‌ అన్య పాండే వంటి చిత్ర బృందం పాల్గొంది. సినిమా గురించి అనేక విషయాలను పంచుకున్నారు. 

click me!