
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రమాదానికి గురయ్యారు. ఆయన కారు యాక్సిడెంట్ కి గురయ్యింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పుట్టపర్తి నుంచి వస్తోండగా ఉండవల్లి సమీపంలో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారుకి ముందుగా వెళ్తోన్న బొలెరో వాహనం ఒక్కసారిగా కుడివైపు టర్న్ తీసుకోవడంతో వెనకాలే వస్తున్న విజయ్ లెక్సస్ కారు దాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండకి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే విజయ్ ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా డ్యామేజ్ అయ్యిందని, దీంతో స్నేహితుడి కారులో విజయ్‌తోపాటు, వారి ఫ్యామిలీ హైదరాబాద్ వెళ్లిపోయిందని సమాచారం.
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే విజయ్ దేవరకొండ కారుకి ప్రమాదం అనే వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగానే ఉన్నారని సమాచారం. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
విజయ్ దేవరకొండ తాజాగా ఒక వీడియోని విడుదల చేశారు. ఆయన పుట్టపర్తికి వెళ్లి అక్కడ తన గురువు పుట్టపర్తి సాయిబాబా గురించి గొప్పగా చెప్పారు. చిన్నప్పుడు విజయ్ అక్కడే చదువుకున్న విషయం తెలిసిందే. దీంతో పుట్టపర్తి ఆశ్రమంతో, సాయిబాబాతో విడదీయరాని అనుబంధం ఉందని, తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశారని, తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అందులో పుట్టపర్తి సాయిబాబు పాత్ర ఎంతో ఉందని విజయ్ ఇందులో వెల్లడించారు. నవంబర్‌లో పుట్టపర్తి సాయిబాబా వందవ జయంతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు విజయ్. ఆ ఈవెంట్‌ని విజయవంతం చేయాలని కోరారు. ఈ అకేషన్‌ని పురస్కరించుకుని పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా విజయ్ కారుకి ప్రమాదం జరిగింది.
ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం విజయ్ ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. హీరోయిన్ రష్మిక మందన్నాతో ఆయన ఎంగేజ్‌మెంట్ జరిగింది. చాలా రహస్యంగా వీరి నిశ్చితార్థం జరగడం విశేషం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు. వీరిద్దరు `గీతగోవిందం` మూవీ సమయంలో పరిచయం అయ్యారు. ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత `డియర్ కామ్రేడ్`లో మరోసారి కలిసి నటించారు. అప్పట్నుంచి వారి మధ్య ప్రేమ బలపడింది. తమ ప్రేమని పెళ్లి పీఠల వరకు తీసుకెళ్లబోతున్నారు.
విజయ్ దేవరకొండ చివరగా `కింగ్డమ్` మూవీతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. సాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా నే హీరోయిన్ అని సమాచారం. ప్రస్తుతం విజయ్ ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నాారు. దీంతోపాటు రవికిరణ్ కోలా దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నారు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నారు.