
విజయ్ దేవరకొండ వరుస చిత్రాలు ప్రకటిస్తున్నారు. అయితే విజయాలు మాత్రం దక్కడం లేదు. గీత గోవిందం తర్వాత ఆయనకు ఆ రేంజ్ హిట్ పడలేదు. గత మూడు చిత్రాలైతే పూర్తి నెగిటివ్ టాక్ తెచ్చుకున్నారు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ ప్లాప్ ఖాతాలో చేరాయి. ఇక లైగర్ డిజాస్టర్ అని చెప్పాలి. లైగర్ రిజల్ట్ విజయ్ దేవరకొండను బాగా దెబ్బతీసింది. ఆ మూవీ సక్సెస్ అయితే ఆయన రేంజ్ మరోలా ఉండేది. పాన్ ఇండియా స్టార్ లిస్ట్ లో చోటు దక్కేది. భారీ హైప్ మధ్య విడుదలైన లైగర్ దారుణ ఫలితం చవిచూసింది.
లైగర్ మూవీ కోసం విజయ్ దేవరకొండ శక్తివంచన లేకుండా కష్టపడ్డాడు. ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ కావడంతో యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్నాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ మనోడ్ని నిండా ముంచేశాడు. అనుకున్న రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదన్న ప్రచారం జరిగింది. దానికి తోడు ఈడీ విచారణలు, ఆరోపణలు. మొత్తంగా లైగర్ విజయ్ కి లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టింది.
ఇదే అసహనాన్ని ఫ్యాన్స్ వెళ్లగక్కారు. తాజాగా విజయ్ దేవరకొండ అభిమానులతో ఆన్లైన్ చాట్ చేశారు. ఫ్యాన్స్ అడిగిన పలు విషయాలకు సమాధానాలు చెప్పారు. కాగా ఓ అభిమాని ఒక్క హిట్ ఇవ్వన్నా... అంటూ తన అసహనం బయటపెట్టాడు. హిట్ ఒకటే పెండింగ్ రా. హిట్టు కొట్టాలి. నెక్స్ట్ కొడదాం... అని విజయ్ దేవరకొండ సమాధానం చెప్పారు. ఖుషి మూవీతో మనం హిట్ కొట్టబోతున్నామన్నా అని ఇతర ఫ్యాన్స్ ఆయనకు హామీ ఇచ్చాడు.
విజయ్ ఫ్యాన్స్ తో ఫుల్ టచ్ లో ఉంటాడు. ఇటీవల తన సొంత ఖర్చులతో 100 లక్కీ ఫ్యాన్స్ ని ఇండియాలో వారు కోరుకున్న ప్రదేశానికి ట్రిప్ కి పంపాడు. అందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. ప్రస్తుతం ఆయన ఖుషి చిత్రం చేస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటించారు. గతంలో మహానటి మూవీలో విజయ్-సమంత జంటగా నటించారు.
ఖుషి షూట్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది విడుదల కానుంది. అలాగే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఒక చిత్రాన్ని ప్రకటించారు. కాగా గతంలో దర్శకుడు సుకుమార్ తో ఓ చిత్రం చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. వరుస పరాజయాల నేపథ్యంలో విజయ్ దేవరకొండకు ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.