
బయోపిక్ సినిమాలకు కరెక్ట్ సెట్టయ్యే నటీనటులు దొరకడమంటే చాలా కష్టం. అయితే బాలీవుడ్ టెక్నీషియన్స్ కి మాత్రం లేడి ఓరియెంటెడ్ సినిమాలేవైనా సరే ఫస్ట్ చాయిస్ గా విద్యా బాలన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. మొన్న ఎన్టీఆర్ బయోపిక్ తో టాలీవుడ్ కి పరిచయమైనా విద్యా బాలన్ ఇప్పుడు ఎక్కువగా నిజ జీవితంలోని పాత్రలనే ఎంచుకుంటోంది.
గణిత శాస్త్రంలో ఎంతో గుర్తింపు తెచ్చుకొని హ్యూమన్ కంప్యూటర్ గా పిలవబడిన శకుంతలా దేవి బయోపిక్ కి ప్రస్తుతం బాలీవుడ్ లో అడుగులు పడుతున్నాయి. అందులో విద్యాబాలన్ నటించనున్నారు. ప్రముఖ లేడి డైరెక్టర్ అను మీనన్ దర్శకత్వం వహించనున్న ఆ సినిమాను అభున్దతియా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. 1982 లో తన అసమాన్య లెక్కలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న శకుంతలా దేవి 2013లో మరణించారు.
తన ఐదేళ్ల వయసులోనే గణిత శాస్త్రంలో ఆరి తేరి లెక్కలతో గురువులకు సైతం షాకిచ్చిన దేవిపై బయోపిక్ చేయాలనీ గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఫైనల్ గా విద్యా బాలన్ ఆ పాత్రలో నటించడానికి ఒప్పుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ బయోపిక్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.