
ప్రముఖ దిగ్గజ నిర్మాత, చెన్నైలోని టాప్ ఫిల్మ్ స్టూడియో ఏవీఎం నిర్మాణ సంస్థ అధినేత ఏవీఎం శరవణన్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి వృద్ధాప్య సమస్యలే కారణమని తెలుస్తోంది.
తమిళ సినీ పరిశ్రమలో కీలక నిర్మాణ సంస్థ అయిన ఏవీఎం, వందలాది విజయవంతమైన చిత్రాలను అందించింది. ఈ సంస్థను ఏవీ మెయ్యప్ప చెట్టియార్ ప్రారంభించగా, ఏవీఎం శరవణన్ దీని బాగోగులు చూసుకున్నారు. సంసారం అది మిన్సారం, నేను ఒక ఆడపిల్లను, శివాజీ, వేటగాడు, అయన్, మిన్సార కనవు లాంటి ఎన్నో హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు.
ఇంతలో, వృద్ధాప్యం కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఏవీఎం శరవణన్ ఈరోజు మరణించారు. ఆయన వయసు 86. గత రెండేళ్లుగా నడవలేక ఇబ్బంది పడుతున్న శరవణన్, గత నెలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఎందరో సూపర్ స్టార్లను పరిచయం చేసిన ఏవీఎం సంస్థను ప్రస్తుతం ఆయన కుమారుడు ఎంఎస్ గుహన్ చూసుకుంటున్నారు.
తెలుగులో ఆయన `లీడర్`, `ఎవరైనా ఎప్పుడైనా`, `జెమినీ`, `ఆ ఒక్కటి అడక్కు`, `సంసారం ఒక చదరంగం`, `శిక్ష`, `నాగు`, `మూడు ముళ్లు`, `పున్నమి నాగు`, `పుట్టినిల్లు మెట్టినిల్లు`, `రాము`, `అవేకళ్లు`, `భక్త ప్రహ్లాద`, `లేత మనసులు`, `భూకైలాష్`, `జీవితం` వంటి అనే చిత్రాలను ఏవీఎం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు.