తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెంటరీ నటుడు కైకాల సత్యానారాయణ(87) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన శుక్రవారం(డిసెంబర్ 23)న తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్‌ని తీవ్ర విషాదంలో ముంచెత్తారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నట లెజెండ్, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యానారాయణ(87)(Kaikala Satyanarayana Death) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే మొదటి తరం దిగ్గజాలు కృష్ణంరాజు, కృష్ణ కన్నుమూశారు. ఇప్పుడు కైకాల మరణంతో మొదటి తరాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోయింది.
గతంలో ఓ సారి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇంట్లో జారిపడటంతో కుటుంబసభ్యులు అప్పుడు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. దాన్నుంచి కోలుకుంటున్న ఆయన ఇప్పుడు మరోసారి అనారోగ్యానికి గురి కావడం, అభిమానులను, తెలుగు చిత్ర పరిశ్రమని విషాదంలోకి నెట్టేసి ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కైకాల సత్యనారాయణ మరణంతో యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ షాక్‌లోకి వెళ్లింది. తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తుంది. కైకాల లేని లోటు తీరని లోటని ఆవేదన చెందుతున్నారు. ఒక లెజెండ్‌ని కోల్పోయామని కంటతడి పెడుతున్నారు. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ వంటి దిగ్గజ నటులకు సమకాలీకులు కైకాల సత్యనారాయణ. ఎస్వీఆర్ సైతం తన నట వారసుడిగా కైకాలని ప్రకటించడం విశేషం. వయో భారం రీత్యా ఆయన ఇటీవల సినిమాలు దూరంగా ఉంటున్నారు. చివరగా కైకాల సత్యనారాయణ 2019లో విడుదలైన `ఎన్టీఆర్ కథానాయకుడు`, `మహర్షి` చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 1935 జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో జన్మించారు సత్యనారాయణ.
ఆయన 1959లో విడుదలైన `సిపాయి కూతురు` చిత్రంతో నటుడిగా వెండితెరకి పరిచయం అయ్యారు. దాదాపు 61సంవత్సరాలు(ఆరు దశాబ్దాలు) సినిమా రంగంలోనే విశేష సేవలందించారు. ఆరు దశాబ్దాల సుధీర్ఘ సినీ జీవితంలో 777కిపైగా చిత్రాల్లో నటించారు. హీరోగా, విలన్ గా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేశారు. పౌరాణికాలు, జానపదాలు, సాంఘీకాలు ఇలా అన్ని రకాల జోనర్ చిత్రాల్లో నటించారు. అన్ని రకాల పాత్రలు చేశారు. ఇంకా చెప్పాలంటే నటుడిగా అన్ని రకాల పాత్రలు పోషించారు. పాత్రలకు వన్నె తెచ్చారు. కైకాల సత్యనారాయణ మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఓ లెజెండ్‌ని కోల్పోయిందంటున్నారు.