`నేను చనిపోతున్నా`.. తండ్రి చివరి మాటని గుర్తు చేసుకుంటూ ఇర్ఫాన్‌ ఖాన్‌ తనయుడి భావోద్వేగం..

By Aithagoni RajuFirst Published Apr 29, 2021, 4:57 PM IST
Highlights

ఇర్ఫాన్‌ ఖాన్‌ ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని తాజాగా కుమారుడు బాబిల్‌ ఖాన్‌.. ఇర్ఫాన్‌ ఖాన్‌ చనిపోవడానికి ముందు తనతో అన్న చివరి మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. 

బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ గతేడాది క్యాన్సర్‌తో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన ముంబయిలోని కోకిలా బెన్‌ ఆసుపత్రిలో క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. నేటికి(ఏప్రిల్‌ 29) తో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఇర్ఫాన్‌ ఖాన్‌ని గుర్తు చేసుకున్నారు ఆయన ఫ్యామిలీ మెంబర్స్. ఇర్ఫాన్‌ ఖాన్‌కి భార్య సుతాపా సిక్డార్‌, ఇద్దరు కుమారులు బాబిల్‌ ఖాన్‌, అయాన్‌ ఖాన్‌ ఉన్నారు. 

తాజాగా కుమారుడు బాబిల్‌ ఖాన్‌.. ఇర్ఫాన్‌ ఖాన్‌ చనిపోవడానికి ముందు తనతో అన్న చివరి మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. `నాన్న ఆరోగ్యం మరింతగా క్షీణించిపోవడంతో ముంబయిలోని కోకిలా బెన్‌ ఆసుపత్రిలో చేర్చాం. చనిపోయే ముందు రెండు రోజులు నేను నాన్నతోనే ఉన్నా. ఆయన తరచూ సృహ కోల్పోతున్నట్టు కనిపించాడు. నా వైపు చూస్తూ నవ్వుతూనే ఓ మాట చెప్పాడు. `నేను చనిపోతున్నా` అని. కాదని వారిస్తున్న వినకుండా నవ్వుతూనే ఉన్నాడు. ఆ తర్వాత అలానే నాన్న నిద్రలోకి వెళ్లిపోయాడు` అని తండ్రి చివరగా చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యాడు బాబిల్‌. 

ఇర్ఫాన్‌ ఖాన్‌ అనేక హిందీ సినిమాల్లో హీరోగా, విలక్షణ పాత్రలు పోషించారు. `ది నెమ్సేక్`, `పాన్ సింగ్ తోమర్`, `హైదర్`, `సలామ్ బాంబే`, `పీకూ`, `హిందీ మీడియం` వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు. వీటితోపాటు `స్లమ్ డాగ్ మిలియనీర్`‌, `లైఫ్ ఆఫ్ పై` వంటి హాలీవుడ్‌ చిత్రాల్లో నటించి మన్ననలు అందుకున్నాడు. తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన `సైనికుడు` సినిమాలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఆయన హాలీవుడ్‌ సేవలకుగానూ ఇటీవల ఆస్కార్‌ ఆయన్ని గుర్తు చేసుకుంటూ నివాళ్ళు అర్పించారు. కొంతకాలంగా ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయన లండన్‌లో వైద్యం కూడా తీసుకున్నారు. అయినప్పటికీ మాయదారి క్యాన్సర్‌ నటుడిని బలితీసుకుంది. 

click me!