
హీరో నితిన్ కి ఇటీవల అంతగా కలసి రావడం లేదు. నితిన్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. గత ఏడాది నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో, అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు.
అయితే నితిన్ ని ఓ క్రేజీ ప్రాజెక్టు వరించినట్లు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ చాలా కాలం క్రితం అల్లు అర్జున్ కోసం అద్భుతమైన కథ రచించారు. ఆ చిత్రానికి ఐకాన్ అనే టైటిల్ కూడా ఖరారు చేస్తూ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కాల్సింది.
కానీ స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోవడంతో బన్నీ తాత్కాలికంగా ఆ చిత్రాన్ని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ చిత్రంతో అందరిని ఆశ్చర్యపరిచారు. వకీల్ సాబ్ సూపర్ హిట్ కావడంతో వేణు శ్రీరామ్ పేరు మారుమోగింది. మరోసారి బన్నీ, వేణుశ్రీరామ్ ఐకాన్ మొదలు కాబోతోంది అంటూ ఆ మధ్యన ప్రచారం ఊపందుకుంది.
కానీ అల్లు అర్జున్ ఇతర దర్శకులతో తన తదుపరి చిత్రాలని లైన్ లో పెడుతున్నారు. దీనితో ఐకాన్ చిత్రం నితిన్ చేతుల్లోకి వెళ్లినట్లు సాలిడ్ బజ్ వినిపిస్తోంది. ఐకాన్ కథకి వేణు శ్రీరామ్ కాస్త మార్పులు చేసి నితిన్ కి వినిపించారట. నితిన్ కూడా ఇంప్రెస్ అయి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి అనౌన్స్ మెంట్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వేణు శ్రీరామ్ ఈ కథని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.