
నైంటీస్ లో తెలుగు సినీ ప్రేక్షకులను ఊపేసిన హీరోయిన్ వాణి విశ్వనాథ్. తాజాగా సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వాణి.. రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి తనకు ఉందని, అయితే రాజకీయాల్లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటోంది. రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకొంటే మాత్రం టిడిపిలోనే చేరుతానని ఈ మళయాళ ముద్దుగుమ్మ అంటోంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని చూపుతోంది. అయితే ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తుందనే విషయమై మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు.
జయజానకినాయకతో సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వాణీ విశ్వనాథ్ రాజకీయాలపై తనకున్న ఆసక్తిని వివరించారు. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉంది. కానీ, ఇప్పటి వరకు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలని గట్టిగా నిర్ణయం తీసుకొంటే మాత్రం తెలుగుదేశం పార్టీలోనే చేరతానని వాణీ విశ్వనాథ్ చెప్పారు. టీడీపీ సిద్ధాంతాలు, నాయకత్వం నచ్చాయని, అందుకే ఆ పార్టీలో చేరాలనుకుంటున్నానని వాణీవిశ్వనాథ్ ప్రకటించారు.
ఇప్పటికే కొంత మంది టిడిపి నాయకులు వచ్చి తనతో మాట్లాడారని.. సినిమా మేనేజర్ నగరి చలపతితో పాటు చాలామంది ఆ నియోజకవర్గ నాయకులు రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఇంకా రాజకీయాల్లో చేరికపై నిర్ణయం తీసుకోలేదని వాణీ విశ్వనాథ్ ప్రకటించారు. ఇక చంద్రబాబు నా అభిమాన నాయకుడు. ఒకసారి ఖచ్చితంగా ఆయన్ను కలుస్తాను. వాణి వల్ల పార్టీకి మేలు జరుగుతుందని ఆయన భావించి అవకాశం ఇస్తే కాదనను. ఒకవేళ ఇవ్వకున్నా బాధపడనని చెప్తోంది వాణీ విశ్వనాథ్.
మళయాళీ అయినా నన్ను ఆదరించింది తెలుగువారేనని.. అందుకే నాకు ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం అని అంటోంది వాణి. అంతేకాదు, ఇండియాలో నాకు నచ్చిన గొప్ప నాయకుడు చంద్రబాబేనని, ఆయన నాయకత్వంలోనే పనిచేయాలనుకుంటున్నానని, అందుకే టిడిపిలో చేరాలనే ఆసక్తిని చూపుతున్నానని వాణీ విశ్వనాథ్ చెప్తోంది.
ఇదిలా వుంటే... చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ స్థానంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టిడిపి అభ్యర్థిగా వాణీ విశ్వనాథ్‌ను బరిలోకి దింపుతారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే టిడిపిలో చేరిన తర్వాత ప్రత్యర్థి ఎవరైనా ఒక్కటేనని వాణీ విశ్వనాథ్ చెప్పారు. ఇంట్లో కానీ, జీవితంలో కానీ, రాజకీయాల్లో కానీ సరైన ప్రత్యర్థి లేకపోతే థ్రిల్ ఉండదన్నారు వాణీ విశ్వనాథ్. అంటే రోజాపై పోటీకి సై అంటోందనే కదా అర్థం. చూద్దాం. రోజా ముందు ఈమె ఏ మేరకు నిలబడుతుందో. రంగంలోకి దిగితేనే కదా తెలిసేది.