
న్యూఢిల్లీ: ఈ రోజు దేశమంతా ఆస్కార్ అవార్డులను గెలుచుకోవడంపై సంబురాలు చేసుకుంటూనే ఉన్నది. నాటు నాటు పాటతోపాటు ది ఎలిఫెంట్ విస్పరర్స్‌కు బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కింది. ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీలో కనిపించిన రెండు ఏనుగులు రఘు, ఆములు ఇప్పుడు కనిపించకుండా పోయాయి. వాటిని కొందరు వ్యక్తులు మద్యం మత్తులో అడవిలోకి తరిమినట్టు తెలిసింది.
క్రిష్ణగిరి అడవుల్లోకి కొందరు వాటిని నిన్న తరిమేసినట్టు వాటిని పెంచిన బొమ్మన్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆ గజరాజుల కోసం బొమ్మన్ వెతుకుతూ ఉన్నారు.
అనాధ ఏనుగు పిల్లలను బొమ్మన్, బెల్లీ దంపతులు పెంచి పెద్దచేశారు. ఈ క్రమంలో ఆ ఏనుగులతో వారికి ఏర్పడ్డ సన్నిహిత సంబంధాన్ని డైరెక్టర్ కార్తికీ గొంజాల్వేజ్ ది ఎలిఫెంట్ విస్పరర్ డాక్యుమెంటరీలో చిత్రీకరించారు.
ఏనుగులు కనిపించకుండా పోయిన తర్వాత బొమ్మన్ వాటి కోసం వెతుకుతూనే ఉన్నారు. ‘నేను ఇప్పుడు క్రిష్ణగిరి అడవుల్లో ఉన్నాను. అడవిలోకి తరిమేయబడ్డ ఏనుగుల కోసం వెతుకుతున్నాను. కొందరు మద్యం మత్తులో వాటిని అడవిలోకి తరిమేశారు’ అని బొమ్మన్ అన్నారు. తాను పెంచిన ఏనుగులు.. ఏనుగుల గుంపులో కలిశాయో లేక.. ఒంటరిగానే అడవిలో తప్పిపోయి తిరుగుతున్నాయో ఇంకా తనకు తెలియదని వివరించారు. ఈ రోజు తాను వాటిని వెతికిపట్టుకుంటానని, లేదంటే రేంజర్‌లకు తెలియజేసి వాటిని అడవిలోనే పెంచమని చెబుతానని తెలిపారు.
తమ దంపతులు, తాము పెంచిన ఏనుగులపై వచ్చిన డాక్యుమెంటరీకి ఆస్కార్ దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. దీనికి క్రెడిట్ అంతా కార్తికికే చెందుతుందని బొమ్మన్ అన్నారు. ‘ఆ సినిమా ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. వాళ్లు కేలం నన్ను, నా ఏనుగులను షూట్ చేశారు. మా రోజువారీ దినచర్యలను షాట్ చేశారు. కానీ, కెమెరా ముందు నిలబడటం కొంత భిన్నంగా అనిపించింది కార్తీకి మేడం, ఏనుగులకు నేను కృతజ్ఞుడిని. ఈ అవార్డు యావత్ దేశానికి గర్వకారణం అవ్వటం సంతోషంగా ఉన్నది.’ అని బొమ్మన్ తెలిపారు.
Also Read: ‘నాటు నాటు’కు ఆస్కార్.. తమ్మారెడ్డి భరద్వాజ రియాక్షన్ ఇదే.. ఏమంటున్నారంటే?
కాగా, బెల్లి మాట్లాడుతూ తనకు ఆస్కార్ అవార్డు గురించి తెలియదని అన్నారు. కానీ, ఆ అవార్డు వచ్చిన తర్వాత తనకు అభినందనలు వెల్లువై వస్తున్నాయని, అవి చూసి సంతోషంగా ఉన్నదని వివరించారు.
తాము తల్లిదండ్రులు లేని ఏనుగులను తమ సొంత పిల్లల్లాగే పెంచామని అన్నారు. గతంలోనూ ఇలా అనాధ జంతువులను పెంచామని వివరించారు. ఇది తమ రక్తంలోనే ఉన్నదని తెలిపారు.