
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిదో వారం ఆటలు అత్యంత ఆసక్తికరంగా మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం 'రివార్డ్ అండ్ రివేంజ్' (Rewards and Revenge) థీమ్‌తో ఆటలు జరుగుతుండటంతో కంటెస్టెంట్లలో టెన్షన్ తారాస్థాయికి చేరింది. రాబోయే పదో వారంలో కుటుంబ సభ్యులను (ఫ్యామిలీ వీక్) కలుసుకునే సువర్ణావకాశం ఈ వారం ఆటల్లో గెలిచే వారిపైనే ఆధారపడి ఉండటంతో అందరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఈ టాస్క్‌ల జోరులో హౌస్‌మేట్స్ మధ్య ఉన్న పాత బంధాలు చెరిగిపోయి, కొత్త విభేదాలు బయటపడుతున్నాయి.
ఈ వారం నిర్వహించిన ఛాలెంజెస్‌లో భాగంగా కంటెస్టెంట్లు హోరాహోరీగా తలపడ్డారు. మొదటి ఛాలెంజ్‌లో ముకేష్ టీమ్ విజయం సాధించగా, ఆ టీమ్ నుంచి శ్వేతకు రివార్డ్ దక్కింది. అయితే, ఈ టాస్క్‌లలో సంచాలకులుగా వ్యవహరించిన త్రిగుణ్, ముకేష్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇద్దరూ వేర్వేరు నిర్ణయాలు ప్రకటించడంతో బిగ్ బాస్ స్వయంగా రంగంలోకి దిగి హెచ్చరించాల్సి వచ్చింది. ఇక రెండో ఛాలెంజ్‌లో భాగంగా బస్తాలు, థర్మకోల్‌తో కూడిన '8' ఆకారపు కొత్త రౌండ్ టాస్క్‌ను నిర్వహించారు. ఈ ఆటలో కంటెస్టెంట్లు ఒకరినొకరు నెట్టుకుంటూ తమ బ్యాగ్స్‌ను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
ఈ టాస్క్ సమయంలోనే హౌస్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత కొంతకాలంగా ముకేష్, వర్షిణిల గ్యాంగ్‌కు సుధీర్ కాస్త దూరం పాటిస్తూ వస్తున్నాడు. నామినేషన్స్ సమయంలో ముకేష్ మాట్లాడిన మాటలు, వర్షిణి ప్రవర్తన సుధీర్‌కు తీవ్ర విసుగు తెప్పించాయి. తాజాగా జరిగిన టాస్క్‌లో ముకేష్ బ్యాగ్ ఖాళీ అవుతుండటంతో, "ఎలాగూ ముకేష్ బ్యాగ్‌లో తక్కువగా ఉంది, అతను ఎలిమినేట్ అవుతాడు కదా" అని సుధీర్ అమన్‌తో వాదించాడు. ఈ మాటలు విన్న ముకేష్ తీవ్ర ఆగ్రహానికి గురై సుధీర్ బ్యాగ్‌ను లాగడానికి ప్రయత్నించాడు. దీంతో సహనం కోల్పోయిన సుధీర్ ఒక్కసారిగా ఊగిపోయాడు. "ఊరికే హెల్ప్ చేయడం.. మళ్లీ వచ్చి నీవల్లే ఇక్కడ ఉన్నావని అనడం ఏంటి? నువ్వు ఇచ్చిన అధికారంతో నేను ఇక్కడ ఉండాలా?" అంటూ తీవ్ర ఆవేశంతో తన మైక్, బ్యాగ్‌లను కింద విసిరేసాడు.
అక్కడితో ఆగకుండా "నాకు ఆ సాయం అసలు వద్దు.. జనాలకు నా ఆట నచ్చకపోతే నేరుగా ఎలిమినేట్ చేసేయండి" అంటూ ఆడియన్స్‌కు నేరుగా రిక్వెస్ట్ చేశాడు. ఈ పరిణామం హౌస్‌లో కలకలం రేపింది. ఆతర్వాత అమన్ సుధీర్ మధ్య కూడా పెద్ద గొడవ జరిగింది. అమన్ వల్ల సుధీర్ ఆట నుంచి డిస్ క్యాలిఫై అయ్యాడు. దాంతో అమన్ పై రకరకాల కామెంట్స్ చేశాడు సుధీర్. ఇక సుధీర్ తన టార్గెట్ లో ఉంటాడని.. అమన్ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఈ టాస్క్ లో వంశీ గెలిచాడు. ఇక ఈ వారంలో కెప్టెన్ త్రిగుణ్, ఆర్కే, శ్వేత మినహా మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ నామినేషన్స్‌లోకి వచ్చారు. అయితే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే, ముకేష్ గ్రూప్ నుంచి ఈసారి డేంజర్ జోన్‌లో సుధీర్, వర్షిణి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.