కొత్త ఏడాది ప్రారంభమై ఐదు రోజుల్లోనే టాలీవుడ్‌ని వెంటాడిన విషాదం..

By Aithagoni RajuFirst Published Jan 5, 2021, 7:11 PM IST
Highlights

గతేడాది మొత్తం కరోనాతో వణికిపోయిన చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అంతలోనే పెను విషాదం అలుముకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర గీత రచయితగా రాణిస్తున్న వెన్నెలకంటి మరణంతో టాలీవుడ్‌ దుఖసాగరంలో మునిగిపోయింది.

గతేడాది మొత్తం కరోనాతో వణికిపోయిన చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అంతలోనే పెను విషాదం అలుముకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర గీత రచయితగా రాణిస్తున్న వెన్నెలకంటి మరణంతో టాలీవుడ్‌ దుఖసాగరంలో మునిగిపోయింది. వెన్నెలకంటి తన 63వ ఏట, మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో టాలీవుడ్‌ రైటర్స్ కుటుంబంలో విషాదం నెలకొంది. 

వెన్నెలకంటి నవంబర్‌ 30, 1957, నెల్లూరులో జన్మించారు. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్‌. హరి కథలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడాన్ని ఆయన బాగా ఇష్ట పడేవారు. పదకొండేళ్లకే కవితలు, పద్యాలూ రాశారు. 1986లో భాస్కర్ రావు డైరెక్షన్‌లో వచ్చిన `శ్రీరామ చంద్రుడు` సినిమాతో గీత రచయితగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వెన్నెలకంటి తండ్రి ప్రతిభా కోటేశ్వరరావుకూ సినీ అనుబంధం ఉంది. ఎస్పీబీ ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగు పెట్టిన వెన్నెలకంటి అంచెలంచెలుగా ఎదిగారు. 

జంద్యాల రాసిన `ఏక్ దిన్కా సుల్తాన్`, `ఈ చరిత్ర ఏ సిరాతో`, `ఎవ్వనిచే జనించు`, `దర్పణం` వంటి నాటకాలలో వెన్నెలకంటి నటించారు. హాలీవుడ్  చిత్రాల తెలుగు డబ్బింగ్ వెన్నెలకంటితోనే ఆరంభం అయ్యాయి. 34 ఏళ్లలో 1500కు పైగా స్ట్రెయిట్‌ పాటలు రాసిన వెన్నెలకంటి.. డబ్బింగ్ చిత్రాల్లో మరో 1500కు పైగా పాటలు రచించారు.   

డైలాగ్‌ రైటర్‌గానూ ఆయన రాణించారు. అనేక డబ్బింగ్‌ సినిమాలతోపాటు, స్ట్రెయిట్‌ సినిమాకు మాటలు రాశారు. వెన్నెలకంటికి ఇద్దరు కుమారులున్నారు. పెద్దకుమారుడు శశాంక్ వెన్నెలకంటి రైటర్‌గా రాణిస్తున్నారు. రెండో కుమారుడు రాకెందు మౌళి డబ్బింగ్‌ స్క్రిప్ట్ రైటర్‌గా, డబ్బింగ్‌ పాటల రచయితగా, నటుడిగా రాణిస్తున్నారు. ఇద్దరు చిత్ర పరిశ్రమలోనే ఉన్నారు. 

ఇదిలా ఉంటే గతేడాది చిత్ర పరిశ్రమలో గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, జయప్రకాష్‌ రెడ్డి, రావి కొండలరావు, కోసూరి వేణుగోపాల్‌ వంటి వారు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇందులో బాలు కరోనాతో దాదాపు నెలరోజులు పోరాడి మరణించారు. తాజాగా కొత్త సంవత్సరం ప్రారంభంలోనే వెన్నెలకంటి మరణం టాలీవుడ్‌కే కాదు, కోలీవుడ్‌కి కూడా తీరని లోటని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన తమిళ సినిమాలకు ఎక్కువగా అనువాద పాటలు రాశారు. 

click me!