
తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన సినిమాలు భారీ వసూళ్లను సాధిస్తున్న తరుణంలో, తాజాగా తమిళ సినిమా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఆ జాబితాలోకి చేరింది. ఈ సినిమా ఏప్రిల్ 29, 2025న థియేటర్లలో విడుదలైంది, 8 కోట్ల చిన్న బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ భారీ రెస్పాన్స్ ను సాధించింది. 80 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇది తమిళ సినీ పరిశ్రమలో ఇటీవలకాలంలో నమోదైన పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ చిత్రంలో శశికుమార్, సిమ్రన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రానికి అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించారు. శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంగా, ‘ధర్మదాసు’ అనే కుటుంబం జీవనోపాధి కోసం భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తుంది. వారు తమ అసలు గుర్తింపును దాచుకొని, సమాజంలో స్థిరపడేందుకు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విషయం చుట్టూ కథ తిరుగుతుంది.
ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, సామాజిక సందేశం కలగలిపి తెరకెక్కించిన ఈసినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. సినిమాను బాగా ఆదరించారు కూడా ముఖ్యంగా సున్నితమైన అంశాన్ని హ్యూమర్‌తో మేళవించి కథను ప్రెజెంట్ చేయడం, సినీ ప్రముఖుల ప్రశంసలకు దారి తీసింది.
ఇటీవల మలయాళంలో ‘ప్రేమలు’, ‘మంజుమ్మేల్ బాయ్స్’, ‘భ్రమయుగం’ వంటి తక్కువ బడ్జెట్ సినిమాలు భారీ విజయాలు సాధించిన తరహాలో, తమిళ పరిశ్రమలో కూడా అలాంటి ప్రయత్నాలకు ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ విజయవంతమైన ఉదాహరణగా నిలిచింది. సాధారణ కథకు సామాజిక స్పర్శతో, వినోదాత్మకంగా చెప్పగలిగిన ఈ సినిమా, తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు తెచ్చి పెట్టింది.