
ఒకే టాక్స్ విధానం వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కోబోతున్న ఇబ్బందులను వివరిస్తూ టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు డి. సురేష్‌బాబు, సి.కల్యాణ్ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమమయ్యారు. జీఎస్టీ అమలుతో చలనచిత్ర రంగానికి ఎదురయ్యే సమస్యలపై చర్చించారు.
భేటీ అనంతరం సురేష్‌బాబు మాట్లాడుతూ... కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీకి మా సమస్యలు వివరించాం. సినీ రంగంపై దేశవ్యాప్తంగా ఒకే ట్యాక్స్ అమలు చేస్తే ప్రాంతీయ చలనచిత్ర రంగం తీవ్రంగా నష్టపోతుంది. తెలంగాణలో చిన్న సినిమాకు 7 శాతం, పెద్ద సినిమాలకు 14 శాతం ట్యాక్స్ ఉంది. దేశ వ్యాప్తంగా ఒకే ట్యాక్స్ తెస్తే హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల ట్యాక్స్‌ను ప్రాంతీయ చలనచిత్ర రంగాలు కట్టాల్సి ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ సినిమాలకు ట్యాక్స్ 24 శాతం ఉంటుంది. జనవరి వరకు స్లాబ్‌లపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మా సమస్యలపై సానుకూలంగా స్పందించి కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశపర్చిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.