
ఇటీవలి టాలీవుడ్‌లో వివిధ పరిణామాలు చోటుచేసుకున్నాయి. థియేటర్ల బంద్ వ్యవహారం నేపథ్యంలో నిర్మాతల సమావేశాలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై పవన్ కళ్యాణ్ చేసిన "రిటర్న్ గిఫ్ట్" వ్యాఖ్యతో పరిశ్రమలో చర్చలు, ఊహాగానాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు, టాలీవుడ్ ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇటు ఏపీ ప్రభుత్వం.. అటు ఇండస్ట్రీలో పెద్దలు ముందడుగు వేశారు.
సీఎం చంద్రబాబుని కలసి ఇండస్ట్రీ సమస్యలపై చర్చించాలని డిసైడ్ అయ్యారు. ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలు, ప్రముఖులు హాజరయ్యే ఈ సమావేశానికి ముహూర్తం కుదిరింది.
ఈ సమావేశం జూన్ 15, 2025 (ఆదివారం) మధ్యాహ్నం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఉండవల్లిలో జరగనుంది.
ఈ సమావేశంలో ప్రభుత్వ పక్షాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఆయన నాయకత్వంలో ఈ భేటీ జరగనుండగా, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులలో సుమారు 30 మంది ఈ సమావేశానికి హాజరుకావనున్నట్లు సమాచారం.
ఇందులో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్య ప్రతినిధులు, కొంతమంది అగ్ర కథానాయకులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు, థియేటర్ల లైసెన్సింగ్ సమస్యలు, టికెట్ ధరలు, భవిష్యత్తులో ప్రభుత్వ సహకార మార్గాలు చర్చకు రావచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇప్పటివరకు ఈ సమావేశానికి సంబంధించిన అజెండా అధికారికంగా ప్రకటించలేదు, కానీ త్వరలోనే మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.
ఈ భేటీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టాలీవుడ్ ప్రముఖులు తొలిసారి సీఎం చంద్రబాబుతో భేటీ కానుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.