
టాలీవుడ్ మరో రత్నం లాంటి డైరెక్టర్ ను కోల్పోయింది.ప్రముఖ దర్శకుడు పి. చంద్ర శేఖర్ రెడ్డి ఈరోజు చైన్నైలో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న పీ సి రెడ్డి.. ఈ రోజు ఉదయం చెన్నై లోని స్వగృహం లో .. ఉదయం 8.30 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. టాలీవుడ్ లో తనదైన మార్క్ తో సినిమాలు చేశారు చంద్రశేఖర్. అలనాటి స్టార్ హీరోలందరితో ఆయన సినిమాలు చేశారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు, నాగేశ్వరావు, కృష్ణ, శోభన్ బాబు లతో పి.సి రెడ్డి సినిమాలు తెరకెక్కించారు.
పి.సి.రెడ్డి పూర్తి పేరు పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి .1933, అక్టోబర్ 15వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనుమసముద్రం గ్రామంలో పందిళ్లపల్లి నారపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. 1959లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీరంగ ప్రవేశం చేశారు. వి.మధుసూధనరావు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయ దర్శకుడిగా, సహ దర్శకుడిగా పని చేశారు. చంద్రశేఖర్ రెడ్డి అనూరాధ అనే సినిమాకు మొదటి సారి దర్శకత్వం వహించారు. బి.గోపాల్, ముత్యాల సుబ్బయ్య, పి.ఎన్.రామచంద్రరావు, శరత్ వంటి దర్శకులు పి సీ రెడ్డి శిష్యులే.
అత్తలు.. కోడళ్ళు సినిమాతో ఆయన ఇండస్ట్రీ లో తనదైన ముద్ర వేశారు. ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణతో సినిమాలు చేశారు రెడ్డి. ఆయన డైరెక్ట్ చేసిన ఏరువాక లాంటి సినిమాలు సూపర్ స్టార్ కు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాయి. చివరిగా 2004 లో కృష్ణ లీడ్ రోల్ లో శాంతి సందేశం సినిమాను తెరకెక్కింయారు ఆయన. డైరెక్టర్ గా రిటైర్డ్ అయ్యాక చెన్నైలోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు చంద్ర శేఖర్ రెడ్డి.
చంద్ర శేఖర్ రెడ్డికి ప్రస్తుతం 86 ఏళ్లు.. ఆయన తన కెరీర్ లో 80 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. చాలా సినిమాలు సక్సెస్ సాధించి.. డైరెక్టర్ గా ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. పి.సి రెడ్డి మరణ వార్త తెలియడంతో టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ విషయం తెలిసి టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.