
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మే 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ బాబు మాస్ లుక్ లో.. కామెడీ టైమింగ్ అదరగొడుతూ కనిపిస్తున్న చిత్రం ఇదే.
ప్రీ రిలీజ్ ఈవెంట్ మహేష్ బాబు స్వయంగా చెబుతూ.. సర్కారు వారి పాటలో నటిస్తున్నప్పుడు తనకి పోకిరి రోజులు గుర్తుకు వచ్చాయని అన్నారు. మహేష్ బాబే ఆ మాట చెప్పాడంటే సినిమా ఎలా ఉండబోతోందో ఊహించుకోవచ్చు. ఫుల్ పాజిటివ్ బజ్ తో మే 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
రిలీజ్ కి సంబంధించి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా సర్కారు వారి పాట చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. తొలి వారంలో టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ జీవో విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం.. ఐమాక్స్, మల్టిఫ్లెక్స్ లలో సర్కారు వారిపాట చిత్ర టికెట్ ధర రూ 50 అదనంగా పెంచుకునే వీలు కల్పించారు. ప్రస్తుతం మల్టి ఫ్లెక్స్ లలో సాధారణ ధరలు సింగిల్ టికెట్ కి 290 వరకు ఉన్నాయి. పెంచిన ధర వల్ల సర్కారు వారి పాట టికెట్ రేటు తొలి వారంలో 340 వరకు ఉండబోతోంది.
ఇక సింగిల్ స్క్రీన్ ఏసీ థియేటర్స్ లో రూ 30 అందనంగా పెంచుకునే వీలు కల్పించారు. నాన్ ఏసీ సింగిల్ స్క్రీన్ లలో టికెట్ ధరలలో మార్పు లేదు. మొదటి వారం రోజులు ఈ టికెట్ ధరలు వర్తిస్తాయి. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటుతో.. సర్కారు వారి పాట రికార్డ్ ఓపెనింగ్స్ కి లైన్ క్లియర్ అయింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సర్కారు వారి పాట చిత్రానికి టికెట్ ధరలు పెంచింది.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన అందాల భామ కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రంలో మహేష్, కీర్తి మధ్య వచ్చే సీన్స్ హైలైట్ అని సమాచారం. సముద్రఖని విలన్ పాత్రలో నటించారు.