
కలర్ ఫోటో మూవీ జాతీయ అవార్డు దక్కించుకోగా టాలీవుడ్ వర్గాలు ఈ మూవీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. దర్శకుడు సందీప్ రాజ్ తో పాటు హీరో హీరోయిన్స్, మేకర్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన కలర్ ఫోటో చిత్రంలో సుహాస్, చాందిని చౌదరి నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ సుహాస్ తో పాటు చాందిని చౌదరికి మంచి బ్రేక్ ఇచ్చింది. తెలుగు అమ్మాయి అయిన చాందినికి కలర్ ఫోటో మూవీ గుర్తింపు తెచ్చింది. ఇక జాతీయ అవార్డు కూడా రావడంతో మరోసారి సుహాస్, చాందిని చౌదరి పేర్లు మీడియాలో మారుమ్రోగుతున్నాయి.
అయితే చాందిని చౌదరికి ఈ ఆఫర్ దర్శకుడు సందీప్ రాజ్ పట్టుదలతోనే దక్కినట్లు తెలుస్తుంది. గతంలో సందీప్ రాజ్ ఈ మూవీ గురించి చెప్పిన విశేషాలు జనాలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఇక సందీప్ రాజ్ ఏమన్నాడంటే... కథ రాసుకునేటప్పుడే సుహాస్, చాందిని చౌదరిలను అనుకున్నాను. హీరో నల్లగా ఉంటాడు, హీరోయిన్ ఉన్నత కుటుంబానికి చెందిన అందమైన అమ్మాయి అని చెప్పాను. అప్పుడు చాందిని చౌదరి ఎందుకు? ఇంకా బాగా తెల్లగా, ఫెయిర్ గా ఉండే హీరోయిన్ ని తీసుకుందామని మేకర్స్ అన్నారట.
దానికి సందీప్ రాజ్ సమాధానంగా.. హీరోయిన్ ది క్యూట్, బబ్లీ గర్ల్ క్యారెక్టర్ కాదు. ఆమె రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. చాందిని చౌదరినే కరెక్ట్ అని పట్టుబట్టి ఆమెను తీసుకున్నారట. అలా కాకుండా సందీప్ రాజ్ మేకర్స్ మాటకు తలొగ్గి వేరే హీరోయిన్ కి అవకాశం ఇస్తే ఆమె కలర్ ఫోటో లాంటి బిగ్గెస్ట్ హిట్ మిస్ అయ్యేది. తెలుగు ఓటీటీ యాప్ ఆహాలో విడుదలైన కలర్ ఫోటో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కలర్ ఫోటో తర్వాత చాందినికి అవకాశాలు పెరిగాయి. గతంతో పోల్చితే చాలా బెటర్.