బాలు మొదటి పాట గురించి ఆంధ్రప్రభ వారపత్రిలో 55 ఏళ్ల క్రితం రాసిన ఆసక్తికర విషయాలు...!

By Satish ReddyFirst Published Sep 25, 2020, 8:44 PM IST
Highlights

బాలు తన మొదటి పాటతోనే గొప్ప గాయకుడిగా నిరూపించుకున్నారట. శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రం కోసం బాలు పాడిన పాట విన్న తరువాత ఆయన గురించి 55 ఏళ్ల క్రితం ఆంద్రప్రభ వారపత్రికలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ విశేషాలు మీ కోసం...   

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు...అలాగే బాలు తన మొదటిపాటతోనే అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నారు. అదే  విషయాన్ని ప్రస్తావిస్తూ 55ఏళ్ల క్రితం ప్రముఖ  తెలుగు వారపత్రిక ఆంధ్ర ప్రభలో బాలు గురించి ఓ ఆసక్తికర కథనం రాయడం జరిగింది. 22ఏళ్ల బాలు శ్రీ శ్రీ మర్యాదరామన్న సినిమాలో పాడిన పాట గురించి చిత్ర ప్రముఖులు మాట్లాడుకున్నారట. బాలును పిట్టా కొంచెం కూత ఘనం అని వారు ప్రస్తావించడం విశేషం. 

ఇక బాలుకు మొదటి అవకాశం ఎలా వచ్చింది అనే విషయాన్ని కూడా ఆ కథనంలో రాశారు. 1963లో మద్రాసులో సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో పాటల పోటీలు జరిగాయి. అప్పటికే ప్లే బ్యాక్ సింగర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న బాలు నెల్లూరు నుండి వెళ్లి ఆ పాటల పోటీలో పాల్గొన్నారు. పెండ్యాల, గంటసాల వంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా ఉన్న ఆ కాంపిటీషన్ లో బాలు మొదటిబహుమతి అందుకున్నారు. 

ఆ వేడుకకు హాజరైన సంగీత దర్శకుడు కోదండపాణికి బాలు పాడినతీరు ఎంతగానో ఆకట్టుకుందట. బాలును కలిసి అభినందించిన కోదండపాణి చాలా బాగా పాడావు, నీకు సినిమాలలో పాడే అవకాశం ఇస్తా...కాకపోతే నీ వాయిస్ లేతగా ఉంది వాయిస్ ముదిరాక కలువు అన్నారట. ఆ మాటలు బాలు మనసులో ఎంతగానో నాటుకుపోగా అప్పటి నుండి గాత్రంపై ద్రుష్టి పెట్టారు. 

నెల్లూరు అయినప్పటికీ బాలు మద్రాసులో బి.టెక్ చదువుతూ ఉండేవాడు. దీనితో అప్పుడప్పుడు కోదండపాణిని కలిసే అవకాశం అతనికి కలిగిందట. అలా కోదండపాణి నటుడు పద్మనాభానికి పరిచయం చేసి, బాలు పాట వినమన్నారట. కొత్త వారిని ప్రోత్సహించే పద్మనాభం శ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాలో ఓ పాట పాడే అవకాశం ఇప్పించారు. 

అప్పటికే స్టార్ సింగర్స్ గా ఉన్న సుశీల, పీబీ శ్రీనివాస్, రఘురామయ్యలతో కలిసి బాలు తన మొదటి పాట పాడారు. దానితో సీనియర్ సింగర్స్ తో అతనికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఎటువంటి సంగీత జ్ఞానం లేకపోయినా ట్యూన్ ని పట్టేసి అవలీలగా పాడగలుతున్న బాలుకు గొప్ప భవిష్యత్ ఉంటుందని ఆయనతో పనిచేసిన సంగీత దర్శకులు అన్నారని ఆ కథనంలో రాశారు. ఇప్పుడు బాలు సంగీతం నేర్చుకుంటున్నాడని, హిందూస్థానీ, కర్ణాటక సంగీతం శాస్త్రీయంగా నేర్చుకోవడాని ప్రయత్నిస్తున్నారని రాశారు. 

click me!