
నాగార్జున తగ్గడం లేదు. ఏది ఏమైనా దసరా బరిలో దిగేందుకే రెడీ అవుతున్నారు. స్నేహితుడు చిరంజీవితో పోటీ పడేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. తాను నటిస్తున్న `ది ఘోస్ట్` చిత్రాన్ని పండుక్కి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ `ది ఘోస్ట్` దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే సినిమా వాయిదా పడబోతుందని, దసరా బరి నుంచి తప్పుకుంటోందనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిరంజీవి సినిమా ఉండటంతో వెనక్కి తగ్గుతున్నారనే కామెంట్లు వినిపించాయి. కానీ అందుతున్న సమాచారం మేరకు సినిమాని వాయిదా వేయడం లేదని, ఎట్టిపరిస్థితుల్లోనూ అక్టోబర్ 5నే విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉందని టాక్.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇందులో నాగార్జున పాత్ర సరికొత్తగా, శక్తివంతంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఆయన విక్రమ్ అనే `రా` పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ఇటీవల `తమహగనే థీమె` సాంగ్ విడుదలై మంచి వ్యూస్‌ని పొందింది.
చిరంజీవి నటిస్తున్న `గాడ్ ఫాదర్` మూవీ కూడా దసరాకి విడుదల కానుంది. అదే రోజు నాగ్ `ది ఘోస్ట్` కూడా రిలీజ్ కాబోతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇద్దరు బిగ్ స్టార్స్ పోటీ పడుబోతుండటంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతుంది. అయితే విజయదశమికి రెండు మూడు సినిమాలు విడుదలకు స్కోప్ ఉంటుంది. ఆ విషయంలో అది పోటీగానే భావించడానికి లేదని అంటున్నారు మేకర్స్. మరి దసరా బరిలో గెలుపెవరిది అనేదానిపై ఆసక్తి నెలకొంది.