
ఆస్కార్ రేంజ్ కు ఎదిగిన మన తెలుగు సినిమా.. ఈసారి జాతీయ అవార్డ్ ల విషయంలో కూడా సత్తా చాటింది. అన్ని భాషలను పక్కకు నెట్టి.. అత్యధికంగా 10 జాతీయ అవార్డ్ లను కైవసం చేసుకుంది. అయితే ఈసారి అవార్డ్ ల విషయంలో.. మెగా ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యే విషయం ఏంటంటే.. ఒక్క అవార్డ్ మినహాయించి.. మిగిలిన అవార్డ్ లన్నీ మెగా హీరోలు నటించిన సినిమాలకు.. మెగా హీరోల సినిమాలకు పనిచేసినవారికే రావడం విశేషం..
దేశ వ్యాప్తంగా సినీమా ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన 69వ జాతీయ అవార్డులను...కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. గురువారం సాయంత్రం విజేతలను ప్రకటించింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఏకంగా 10 జాతీయ అవార్డ్ లతో దుమ్మురేపింది తెలుగు సినిమా. అంతేకాదు జాతీయ ఉత్తమ నటుడిగా అల్లుఅర్జున్ అవార్డు గెలుచుకోవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ అవార్డ్ తో టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ సాధించాడు బన్నీ. ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రంలో ఈ ఘనత అందుకున్న మొదటి తెలుగు నటుడిగా నిలిచాడు.
ఇంకా చాలా కేటగిరిల్లో తెలుగు సినిమాలు అవార్డులు సొంతం చేసుకున్నాయి. అయితే ఈసారి స్పెషల్ ఏంటీ అంటే.. మెగా హీరోలు నటించిన సినిమాలకే దాదాపుగా జాతీయ అవార్డ్ లన్నీ వరించాయి. ఒక్క బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ విభాగం తప్పించి.. తెలుగు సినిమాకు వచ్చిన మిగతా 9 జాతీయ అవార్డ్ లు మెగా హీరోలు నటించినవే. అందులో ముఖ్యంగా.. ఎన్టీఆర్ తో కలిసి.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమానే ఏకంగా 6 అవార్డులు వరించాయి. జాతీయ అవార్డ్ లలో సిక్స్ కొట్టారు ట్రిపుల్ ఆర్ టీమ్. అయితే రామ్ చరణ్ కు కాని.. ఎన్టీఆర్ కు కాని.. రాజమౌళికి కాని అవార్డ్ రాకపోవడం ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు.
ఇక బెస్ట్ ఫిల్మ్ గా ఉప్పెన కు జాతీయ అవార్డ్ రాగా.. ఈసినిమా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించినది కావడం విశేషం. ఉప్పెన సినిమా ప్రాంతీయ ఉత్తమ చిత్రం కేటగిరీలో అవార్డ్ ను సొంతం చేసుకుంది. వైష్ణవ్ తేజ్ నటించిన మరో సినిమా కొండపొలంకు బెస్ట్ లిరిక్స్ కేటగిరీల్లో అవార్డు వచ్చింది. క్రిష్ డైరెక్ట్ చేసిన కొండపొలం సినిమా ప్లాప్ అవ్వగా.. ఈసినిమాలో ధమ్ ధమాదమ్ పాటకు గాను చంద్రబోస్ ఈ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు.
ఇక పుష్పతో అల్లు అర్జున్ అవార్డ్ సాధిస్తే.. పుష్ప సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ను అందించి.. దేవిశ్రీ ప్రసాద్ నేషనల్ అవార్డ్ ను సాధించారు.. బెస్ట్ మ్యూజిక్ అవార్డ్ కేటగిరీలో.. పాటలకు గాను పుష్ప సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ నేషనల్ అవార్డ్ విన్నర్ గా నిలవగా.. ఆర్ఆర్ఆర్ కు బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ కు గాను కీరవాణి జాతీయ అవార్డ్ ను సాధించారు. ఇలా మెగా ఇంట జాతీయ అవార్డుల పంట అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.