
అదృష్టవంతుణ్ణి ఎవడూ చెడగొట్టలేడు దురదృష్టవంతుణ్ణి ఎవడూ బాగు చేయలేడు... అనేది సామెత. కొందరిని చూస్తే ప్రాక్టికల్ గా కూడా ఇది నిజమే అనిపిస్తుంది. ఇరవై ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బీవీఎస్ రవి(BVS Ravi)కి ఒక్కటంటే ఒక్క బ్రేక్ రావడం లేదు. దర్శకుడిగా ఓ స్థాయికి ఎదగాలన్న ఆయన కలలు నెరవేరడం లేదు. బీవీఎస్ రవి కంటే వెనకొచ్చిన అనేక మంది యంగ్ డైరెక్టర్స్ రేసులో దూసుకుపోతున్నారు. అనిల్ రావిపూడి లాంటి వాళ్ళు స్టార్స్ తో సినిమాలు చేస్తున్నారు. రవి కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది.
లేటెస్ట్ రిలీజ్ థాంక్యూ(Thank You) మూవీపై రవి చాలా నమ్మకం పెట్టుకొన్నారు. ఈ చిత్రానికి ఆయన కథ, స్క్రీన్ ప్లే సమకూర్చారు. ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొని సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజుకు దగ్గరయ్యారు. తీరా సినిమా ఫలితం దారుణంగా వచ్చింది. నాగ చైతన్య(Naga Chaitanya) కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా థాంక్యూ నిలిచింది. ఆయన అట్టర్ ప్లాప్ సినిమాలు కూడా మూడు నుండి నాలుగు కోట్ల ఫస్ట్ డే షేర్ రాబడితే థాంక్యూ కేవలం రూ. 1.5 కోట్ల షేర్ తో నిర్మాతలకు షాక్ ఇచ్చింది.
థాంక్యూ మూవీ సక్సెస్ అయితే క్రెడిట్ ఖాతాలో లో వేసుకొని డైరెక్టర్ గా బిజీ కావాలని రవి ఆశించాడు. థాంక్యూ మూవీ ప్రమోషన్స్ లో దిల్ రాజు బ్యానర్ లో డైరెక్టర్ గా మూవీ చేస్తున్నానని రవి ప్రకటించారు. థాంక్యూ ఫలితం తర్వాత దిల్ రాజు ఆ సాహసం చేయకపోవచ్చు. అందులోనూ డైరెక్టర్ గా బీవీఎస్ రవి దారుణమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. గోపీచంద్ హీరోగా వాంటెడ్, సాయి ధరమ్ తేజ్ తో జవాన్ చిత్రాలను బీవీఎస్ రవి తెరకెక్కించాడు. ఆ రెండు టాలీవుడ్ డిజాస్టర్స్ లిస్ట్ లో చేరాయి.
ఇక బీవీఎస్ రవి డైరెక్టర్ గా ఆహా లో ప్రసారమైన బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ సూపర్ సక్సెస్ సాధించింది. ఈ క్రమంలో బాలయ్యతో కూడా మూవీ చేసే ప్రయత్నాల్లో బీవీఎస్ రవి ఉన్నట్లు సమాచారం. థాంక్యూ ఫలితం నేపథ్యంలో బాలయ్య బీవీఎస్ రవికి ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. దర్శకుడిగా ప్రమోట్ కావాలన్న మాట అటుంచితే... ఇకపై ఆయన కథలకు డిమాండ్ ఉండకపోవచ్చు. స్టార్ హీరోలు, డైరెక్టర్స్ బీవీఎస్ రవి కథలు అంటే భయపడే సూచనలు కలవు. మొత్తంగా థాంక్యూ మూవీతో బీవీఎస్ రవి నిండా మునిగిపోయాడు.