
తెలుగు చిత్ర పరిశ్రమని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లకి అసలు ఏపీ గుర్తుందా? టికెట్ల రేట్లు తగ్గిస్తే సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని, ప్రభుత్వ నిర్ణయంలో తప్పేముందని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం మధ్యాహ్నం దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో.. మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. ఈ సమయంలో ఎమ్మెల్యే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతున్నాయి.
కోవూరు ఎమ్మెల్యే అని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన టాలీవుడ్‌పై స్పందించారు. సినిమా వాళ్లు హైదరాబాద్‌లో ఉన్నారని, వారికి ఏపీ కనిపిస్తుందా అని ప్రశ్నించారు. నిర్మాతలు బలిసి కొట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే తన ఇమేజ్‌ని పెంచుకునేందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తారని, గతంలో ఐఏఎస్, ఏపీఎస్ అధికారులపై కూడా ఆరోపణలు చేసిన సందర్భాలున్నాయని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సినీ అభిమానులు విరుచుకుపడుతున్నారు. తీవ్ర స్థాయి మండిపడుతున్నారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. `కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు సినిమా నిర్మాతలనుద్దేశించి మాట్లాడుతూ `మన సినిమా నిర్మాతలను బలిసినవాల్లు` అని అనడం చాలా బాధాకరం, నిజ నిజాలు తెలియకుండా ఒక గౌరవ శాసన సభ్యులు ఈ విధంగా మాట్లాడటం, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను అవమానించినట్టు గా భావిస్తున్నాము. మన తెలుగు సినిమా సక్సెస్ రేటు సుమారుగా 2 నుండి 5% మాత్రమే, మిగిలిన సినిమాలు నష్టపోవడం జరుగుతుంది.
చిత్రసీమలో ఉన్న 24 క్రాఫ్ట్స్ కు పని కల్పిస్తూ, అనేక ఇబ్బందులు పడి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీసిన నిర్మాతలు, చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుంది. ఈ కష్ట, నష్టాల, బారిన పడి కొంతమంది నిర్మాతలు చలన చిత్ర నిర్మాతల మండలి నుండి నెలకు 3000/- రూపాయలు పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీనిని బట్టి చలన చిత్ర నిర్మాతలు ఎలాంటి దారుణ పరిస్థితులలో ఉన్నారన్న విషయం తెలుసుకోవచ్చు. గౌరవ శాసన సభ్యులు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిర్మాతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తూ వారి వ్యాఖలను ఉపసంహరించుకోవాలని కోరుచున్నాము` అని చెబుతూ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శులు మోహన్‌వడ్లబట్ల, టి.ప్రసన్న కుమార్ ప్రకటన విడుదల చేశారు.