
‘హను-మాన్’లో ప్రభాస్ ఉంటే ఎలా ఉండేదే అనే ప్రశ్న అప్పుడు అంతటా వినిపించింది. అయితే ఆ సినిమాలో ప్రబాస్ లేకపోయినా ఇప్పుడు ప్రభాస్ సినిమాలో మాత్రం ‘హనుమాన్’ హీరో తేజ సజ్జా కనిపించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అందులో ఎంతవరకూ నిజం ఉంది.
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందించిన చిత్రం ‘హనుమాన్’ (Hanu-Man). సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాపై పలువు స్టార్ నటీనటులు, ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit shah) సైతం చిత్ర టీమ్ ని అభినందించారు. ఈ సినిమా చారిత్రక విజయం సాధించిందన్నారు. రికార్డులు బ్రేక్ చేసిన ఈ సినిమాలో హనుమంతు పాత్రలో నటించి మెప్పించారు తేజ. ఇందుకుగాను ‘మోస్ట్ పాపులర్ యాక్టర్‌గా’ గామా అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రూపొందించనున్నారు.
ఇదిలా ఉంటే .. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారన్న వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నిర్మాతతో తేజ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటమే అందుకు కారణం. దీంతో ఈ వార్తలు నిజమే అంటోంది మీడియా. కల్కి చిత్రంలో వీరాభిమన్యు పాత్రలో తేజ సజ్జా కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. మహాభారతం బేస్ చేసుకుని సాగే ఈ కథలో ప్రబాస్ తో పాటు కొన్ని సీన్స్ లో కనపడబోతున్నారని ,ప్లాష్ బ్యాక్ లో ఆ ఎపిసోడ్స్ వస్తాయంటున్నారు. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా నాగ్‌అశ్విన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఈ విషయమై తేజ సజ్జా మాట్లాడలేదు కానీ ...రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వూలో ... “ కొన్ని ఎక్సైటింగ్ ప్రాజెక్టులు పైప్ లైన్ లో ఉన్నాయి. కొన్ని ఇంట్రస్టింగ్ కొలాబిరేషన్స్ సైతం ఉన్నాయి. నేను వాటిని ఎప్పుడు బయిటపెడదామా అని సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నాను. నా కెరీర్ లైనప్ గురించి త్వరలోనే చెప్తాను .నేను నటించేందుకు కథలు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని వినోదాత్మక కథలు పరిశీలనలో ఉన్నాయి. వాటి వివరాలు వెల్లడించడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా”అన్నారు. ఇది విన్న చాలా మంది ఖచ్చితంగా ప్రభాస్ సినిమా గురించే తేజ సజ్జా ఈ మాటలు అన్నది అంటున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ తేజ సజ్జా కు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కల్కిలో తీసుకునే ఉంటారని చెప్తున్నారు.