
గత 20 రోజులుగా తారకరత్నకు ఐసీయూలో వైద్యం జరుగుతుంది. ఆయన ప్రస్తుత కండీషన్ పై ఎలాంటి సమాచారం లేదు. నారాయణ హృదయాలయ వైద్యులు సమాచారం ఇవ్వడం లేదు. కుటుంబ సభ్యులు కూడా అరాకొరా సమాధానాలు ఇస్తున్నారు. సోమ లేదా మంగళవారాల్లో తారకరత్న హెల్త్ బులిటెన్ రానుందని ప్రచారం జరిగింది. అయితే వైద్యులు ఏవిధమైన ప్రకటన చేయలేదు. కాగా నేడు తారకరత్న మెదడుకు పరీక్షలు నిర్వహించారని సమాచారం. తల స్కాన్ చేశారని తెలుస్తుంది.
ఈ క్రమంలో సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. దీంతో తారకరత్న ఆరోగ్యం మీద పూర్తి స్పష్టత రానుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం తారకరత్న ప్రధాన అవయవాల తీరు మెరుగైంది. గుండె, కాలేయం, మూత్రపిండాలు సాధారణ స్థితికి వచ్చాయి. రక్త ప్రసరణ కూడా బాగుంది. మెదడులో మాత్రం సమస్య అలానే ఉంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా తారకరత్న మెదడుకు రక్త ప్రసరణ జరగలేదు. దాంతో మెదడు వాపుకు గురైంది.
విదేశాల నుండి వచ్చిన న్యూరో వైద్యులు ఈ సమస్య నుండి తారకరత్నను బయటపడేసేందుకు కృషి చేస్తున్నారు. తారకరత్న కోమా నుండి బయటకు రాకపోవడానికి ప్రధాన కారణం మెదడులో ఏర్పడిన సమస్యే. బ్రెయిన్ సాధారణ స్థితికి వచ్చినట్లైతే తారకరత్న పూర్తిగా కోలుకున్నట్లే. ఏది ఏమైనా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో తారకరత్న కండీషన్ మీద పూర్తి అవగాహన వస్తుంది.
జనవరి 27న తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సిబ్బంది, కార్యకర్తలు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అదే రోజు అర్ధరాత్రి మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు నారాయణ హృదయాల ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది.