మిల్కీ బ్యూటీ తమన్నా వివాదంలో ఇరుక్కుంది. ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన స్ట్రీమింగ్ కేసులో ఆమెకి నోటీసులు పంపించారు సైబర్ సెల్ అధికారులు.
మిల్కీ బ్యూటీ తమన్నా వివాదంలో ఇరుక్కున్నారు. ఐపీఎల్ అక్రమ స్ట్రీమింగ్ కేసులో ఆమెకి నోటీసులు అందాయి. అనుమతి లేకుండా ఐపీఎల్ మ్యాచ్‌లను టెలీకాస్ట్ చేసిన కేసులో మహారాష్ట్ర సైబల్ సెల్ తమన్నాకి నోటీసులు పంపింది. తమన్నాతోపాటు సీనియర్ నటుడు సంజయ్ దత్‌కి కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. వీరితోపాటు జాక్వెలిన్ పేరు కూడా ఈ కేసులో వినిపించింది.
తమన్నాని ఈ నెల 29న సైబల్ సెల్ ముందు విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో తెలిపారు. అలాగే సంజయ్ దత్‌కి ఈ నెల 23నే విచారణకు హాజరు కావాలని తెలపగా, ఆయన హాజరు కాలేదు. విదేశాల్లో ఉన్న కారణంగా తాను హాజరు కాలేదని, మరో డేట్ ఇవ్వాలని ఆయన సైబర్ సెల్‌కి కోరినట్టు తెలుస్తుంది. ఇంతకి ఏం జరిగిందంటే.. ఐపీఎల్ మ్యాచ్‌లకు తమన్నా, సంజయ్ దత్‌లకు లింకేంటి? అనేది చూస్తే..
2023లో ఐపీఎల్ మ్యాచ్‌లను ఫెయిర్ ప్లే అనే యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. కానీ ఈ మ్యాచ్‌లకు సంబంధించిన సర్వ అధికారాలు వయాకామ్ 18కి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు తెలియకుండా, తమ అనుమతి లేకుండా ఫెయిర్ ప్లే యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను టెలికాస్ట్ చేశారు. దీంతో తమకు వంద కోట్ల మేరకు నష్టం వచ్చిందని వయాకామ్ 18 నెట్‌వర్క్.. మహారాష్ట్ర సైబర్ సెల్‌కి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన వాళ్లు ఫెయిర్‌ప్లే తోపాటు తమన్నా, సంజయ్ దత్‌లకు నోటీసులు జారీ చేశారు.
మరి దానికి, వీరికి లింకేంటంటే.. ఆ ఫెయిర్ ప్లే యాప్‌కి తమన్నా, సంజయ్ దత్ ప్రచార కర్తలుగా ఉన్నారు. ఆయా ప్రోగ్రామ్‌లను వాళ్లు కూడా ప్రచారం చేశారు. దీంతో ఈ ఐపీఎల్ మ్యాచ్‌ల స్ట్రీమింగ్‌కి, వారికి ఉన్న సంబంధం ఏంటి? అనేది మహారాష్ట్ర సైబర్ సెల్ విచారించబోతుంది. ఈ మేరకు తమ ముందు హాజరు కావాలని వీరికి సమన్లు పంపారు. తమన్నా ఈ నెల 29న వారి ముందు హాజరు కావాల్సి ఉంది. సంజయ్ దత్ ఎప్పుడు హాజరవుతారనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ కేసులో జాక్వెలిన్ పేరు కూడా ఉంది. ఆమెకి కూడా నోటీసులు పంపించారు.
తమన్నా చివరగా తెలుగులో `భోళా శంకర్` చిత్రంలో నటించింది. ఇప్పుడు చాలా గ్యాప్‌తో `ఓడెల 2`లో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతోపాటు హిందీలో రెండు సినిమాలు, తమిళంలో ఓ మూవీ చేస్తుంది తమన్నా.