పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతికకాయం.. కడసారి చూసేందుకు అభిమానులకు అనుమతి.. మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు..

Published : Nov 16, 2022, 09:34 AM ISTUpdated : Nov 16, 2022, 09:41 AM IST
పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతికకాయం.. కడసారి చూసేందుకు అభిమానులకు అనుమతి.. మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు..

సారాంశం

సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయా స్టూడియో‌కు తీసుకొచ్చారు. ఈ రోజు ఉదయం నానక్‌రామ్‌గూడలోని నివాసం నుంచి కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయా  స్టూడియోకు తరలించారు.

ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయా స్టూడియో‌కు తీసుకొచ్చారు. ఈ రోజు ఉదయం నానక్‌రామ్‌గూడలోని నివాసం నుంచి కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయా  స్టూడియోకు తరలించారు. అక్కడ అభిమాన నటుడి కడచూపు కోసం అభిమానులను అనుమతిస్తున్నారు. దీంతో పెద్దఎత్తున పద్మాలయా స్టూడియోకు చేరుకున్న అభిమానులు.. కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పద్మాలయా స్టూడియోకు చేరుకుంటున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పద్మాలయా స్టూడియో వద్ద భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ఈరోజు హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. 

ఇక, మధ్యాహ్నం వరకు సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయా స్టూడియోలోనే ఉంచనున్నారు. మధ్యాహ్నం కృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. పద్మాలయా స్టూడియోలో కొన్ని ఆచార కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం.. అక్కడి నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగనుంది. మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. 

ఇక, ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆదివారం అర్దరాత్రి దాటిన తర్వాత గుండెపోటుతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబంతో పాటు అభిమానుల్లో, చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం కృష్ణ భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళుర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సినీ ప్రముఖులు చిరంజీవి, రాఘవేంద్రరావు, వెంకటేష్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రాజేంద్ర ప్రసాద్.. తదితరులు నానక్‌రామ్‌గూడలోని నివాసంలో కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. 

అయితే మంగళవారం సాయంత్రం అభిమానులు కృష్ణకు నివాళులర్పించేందుకు వీలుగా.. గచ్చిబౌలి స్టేడియానికి ఆయన భౌతికకాయాన్ని తరలించాలని భావించారు. అందుకు సంబంధించి స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల గచ్చిబౌలి స్టేడియానికి తరలించకుండా.. రాత్రికి నానక్‌రామ్‌గూడలోని నివాసంలోనే కృష్ణ భౌతికకాయాన్ని ఉంచారు. ఈరోజు ఉదయం పద్మాలయా స్టూడియోకు కృష్ణ భౌతికకాయాన్ని తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్